
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెతను నేటి కాలం రాజకీయ పార్టీల అధినేతలు తిప్పి రాస్తున్నారు. ప్రజలు అడగకుండానే వారి అవసరాలు తీర్చేందుకు గాను ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాల రూపంలో రాజకీయ నాయకులు లక్షల కోట్ల ధనాన్ని వెచ్చిస్తున్నారు.
అలాగే అడిగితే అమ్మైనా అన్నం పెట్టడానికి అరగంట ఆలస్యం చేస్తుందేమో కానీ ప్రభుత్వాలు మాత్రం టంచనుగా మొదటి తారీఖు నాటికీ సంక్షేమ పథకాలను ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నాయి. పెంషన్ల నుంచి రేషన్ వరకు, అమ్మ ఒడి నుంచి ఉచిత బస్సు వరకు ఈ సంక్షేమ పథకాల్ని కూడా అడగకుండా పెట్టిన అన్నం వంటివే.
అయితే ఈ సంక్షేమ పథకాలే రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నేతలకు రాజమార్గం అవుతున్నాయా అంటే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ పార్టీ అనే చెప్పాలి. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ తన ఎజెండా, తన పార్టీ జెండా రెండు కూడా సంక్షేమమే అన్నట్టుగా పాలన సాగించారు.
అభివృద్ధికి సంక్షేమం ముసుగు వేసి అప్పులు చేసి మరి ఉచిత పథకాలను డోర్ డెలివెరీలు చేసారు. కేవలం బటన్ నొక్కడమే పాలన, ఉచితాల పంపకమే ప్రభుత్వ విధానం అన్నట్టుగా సాగిన వైఎస్ జగన్ పాలన కు ప్రజలు ఐదేళ్లకే ఎక్సపైరీ డేట్ ఇచ్చారు.
రాజధాని నిర్మాణాలను సమాధి చేసి, రహదారుల మరమ్మత్తులను వర్షానికొదిలేసి, అభివృద్ధిని గాలికి వదిలి పెట్టి మరి నవరత్నాల పేరుతో ఉచిత పథకాలను అందించారు. మరి అంతటి సంక్షేమ పథకాలు అందించిన జగన్ ని కాదని ప్రజలు కూటమి కి పట్టం కట్టారు అంటే ప్రజలు ఆశిస్తున్నది కేవలం ఉచిత పథకాలు మాత్రమే కాదని స్పష్టమయిపోయింది.
అసలు ప్రజలు ప్రభుత్వాల నుంచి ఆశిస్తున్నదేమిటి.? ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్నదేమిటి.? నవరత్నాలు తీసుకుని వైసీపీ ని 151 నుంచి 11 తో పాతాళానికి తొక్కడం వెనుకున్న ఆ పరమార్ధం ఏమిటి.? నేడు కూటమి కూడా మహిళలకు అడగకుండానే ఉచిత బస్సు సౌకర్యం అందించింది.
సమయానికి విద్యార్థులకు అల్పాహారం నుంచి మధ్యాన భోజనం వరకు ఉచితంగా అందిస్తుంది. అయితే కూటమి తిరిగి అధికారం పొందడానికి ఈ సూపర్ సిక్స్ సరిపోతాయా.? లేదా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలను అందుబాటులోకి తేవడం, పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయడం, రాష్ట్రాన్ని సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం,
నూతన రహదారులను నిర్మించడం, మౌలిక వసతుల సౌకర్యలను సుదూర ప్రాంతాలకు విస్తరించడం, ఎయిర్ ఫోర్టులను, ఫోర్టులను నిర్మించడం, టూరిజం డెవలప్ చేయడం, కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయం చేయడం వంటి అంశాలను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారా.? అనేది రానున్న కాలంలో తేలనుంది.
ఏదిఏమైనా సంక్షేమం అనేది అధికారానికి రాజమార్గం కాదనేది మాత్రం సుస్పష్టం. మరి ప్రజలు అడగకుండా ప్రభుత్వాలు పెడుతున్న ఈ సంక్షేమం వారి ఆకలి తీర్చే పరమాన్నం అవుతుందా.? లేదా అభివృద్ధితో ఆదాయ మార్గాలను చూపించే రాజకీయమే ప్రజల కడుపు నింపుతుందా.?
In the film industry, a famous surname can make the first step much easier. It…
Not every fan meeting is a political rehearsal. But in Tamil Nadu today, it is…