టాప్ డైరెక్టర్స్ తో పాటు పేరు ప్రఖ్యాతలు లేని వర్ధమాన దర్శకులకు అవకాశాలు కల్పించడం టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమైంది. కెరీర్ తొలినాళ్ళ నుండి అవలంభిస్తున్న ఈ విధానం ఒక రకంగా దర్శకుల పాలిట వరమైనా, అవాక్కవ్వడం అభిమానుల వంతవుతోంది.
ఇలాంటి షాకింగ్ లాంటి వార్తే తాజాగా ‘లయన్’ చిత్ర దర్శకుడు సత్యదేవ వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మిస్తున్న సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నానని సత్యదేవ వెల్లడించారు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా 101వ సినిమాకు కూడా తానే దర్శకత్వం వహించబోతున్నానని తెలిపారు.
బాలయ్య ఫ్యాన్స్ ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వార్త విని “దేవుడా… పవన్ కళ్యాణ్ కు ఏమైంది..?” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇలాంటి దర్శకులను ఎంచుకోవడం ద్వారా, సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తనకు దక్కుతుందనే ఉద్దేశంతోనే పవన్ ఇలాంటి వారిని ఎంపిక చేసుకుంటారనే వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంది. అయితే చేసే కొన్ని సినిమాలైనా టాప్ దర్శకుల దర్శకత్వంలో చేయాలని అభిమానులు కోరుకోవడంలో కూడా తప్పు లేదుగా..!



