జగన్‌ ఓటమిలో సాక్షి వాటా ఎంత?

గత ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన జగన్మోహన్‌ రెడ్డి ఈసారి ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారు? అంటే రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఒక్కో కారణం చెప్పగలరు.

కానీ ఓటమికి ఆత్మవిమర్శ చేసుకుంటే, అద్దంలో తన మొహమే కనబడుతుందని జగన్‌ అనుకున్నారో ఏమో… మొక్కుబడిగా సమావేశంలో ఈవీఎంలే కారణమని నిర్ధారించేసి బెంగళూరుకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అది ఆయన పార్టీ… ఆయన ఇష్టం కనుక ఎవరూ తప్పు పట్టనవసరం లేదు.

ADVERTISEMENT

అయితే వైసీపి ఓటమికి జగన్‌ చిత్రవిచిత్రమైన ఆలోచనలు, అహంకారమే కారణమా?అంటే అనేక కారణాలలో అవి కూడా ఒకటి మాత్రమే.

జగన్‌కు చివరి వరకు శల్యసారధ్యం చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి, ఐప్యాక్, ఆరా మస్తాన్ వంటి మేధావులు, రోజా, కొడాలి, అంబటి వంటి నోటి దురద నేతలు కూడా వైసీపి ఓటమికి కారకులే అని చెప్పవచ్చు.

వీరందరూ ఓ ఎత్తు అయితే సాక్షి మీడియా ఒక్కటీ మరో ఎత్తు అని చెప్పక తప్పదు. ఎందువల్ల అంటే, జాతీయ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు బలమైన నెట్‌వర్క్ కలిగి రాజకీయ పరిణామాలు, సమీకరణాలు, వాటిలో కలుగుతున్న మార్పులు, పర్యవసానాల గురించి సాక్షి మీడియాకు తెలిసినంత మరొకరికి తెలియడంటే అతిశయోక్తి కాదు.

అదేవిదంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రజల అభిప్రాయాలు, వారి ఆకాంక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?వంటి విషయాలు సాక్షి మీడియాకు తెలియవనుకోలేము.

జగన్‌ ప్రత్యర్ధులతో అధికార పార్టీలా హోరాహోరీ పోరాడిన సాక్షి మీడియా, జగన్‌పై ఈగ వాలకుండా కాపాడుకుంటూ, జగన్‌ తప్పులన్నిటినీ కవర్ చేసేందుకే ప్రయత్నించింది తప్ప ఎప్పటికప్పుడు జగన్‌ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించలేదు.

అదే… జగన్‌ ‘ఎల్లో మీడియా’ అంటూ ముద్ర వేసిన కొన్ని మీడియా సంస్థలు జగన్‌ పాలనను ఎండగడుతూనే టిడిపి, జనసేనలు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండేవి. ముఖ్యంగా ఇటువంటి కొన్ని వెబ్‌సైట్లు, మీడియా సంస్థలు పలు సందర్భాలలో టిడిపి, జనసేనల తీరు, వ్యూహాలు, బలాబలాలపై విశ్లేషణాత్మక కధనాలు ప్రచురిస్తూ అప్రమత్తం చేస్తూండేవి.

ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ కొన్ని సందర్భాలలో ముక్కుసూటిగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లతో సహా ఆయా పార్టీ నేతల తప్పొప్పులను చెప్పేస్తూ విమర్శల పాలయ్యేవారు కూడా. కానీ టిడిపి, జనసేనలు వాటిని హుందాగా స్వీకరించి లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగి విజయం సాధించాయి.

ఆ ఎల్లో మీడియాని చూసైనా సాక్షి మీడియా జగన్మోహన్‌ రెడ్డికి వాస్తవాలు, వాస్తవ పరిస్థితులను తెలియజేయలేదు. 175 సీట్ల భ్రమలో జగన్‌ గుడ్డిగా ముందుకు సాగుతుంటే ‘అది భ్రమ’ అని జగన్‌కు ధైర్యంగా చెప్పే బదులు సాక్షి మీడియా కూడా ‘175 మనకే మాకే…’ అంటూ వంత పాడుతూ జగన్‌ని ప్రోత్సహిస్తూ గోతిలో పడేలా చేసిందని చెప్పకతప్పదు.

సాక్షి ఓ మీడియా సంస్థ మాత్రమే రాజకీయ పార్టీ కాదు కనుక జగన్‌ని హెచ్చరించవలసిన బాధ్యత లేదని సమర్ధించుకోవచ్చు. కానీ సాక్షి మీడియా ఓ రాజకీయపార్టీలాగే వ్యవహరించింది కనుక దానికి ఆ బాధ్యత తప్పక ఉంటుంది. కానీ అది జగన్‌ భజనతోనే సరిపెట్టుకుంది. కనుక ‘తిలా పాపం తలో పిడికెడు’ అన్నట్లు జగన్‌ ఓటమికి సాక్షి మీడియా కూడా ఓ కారణమే అని భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

2 hours ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

3 hours ago