
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన 8 సీట్లకు పోటీ చేస్తోంది. అయితే వాటిలో ఒక్క కూకట్‌పల్లి సీటుని గెలుచుకోవడంపైనే ఆశ పెట్టుకొన్నట్లు స్పష్టమవుతోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు కానీ తన పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల కంటే బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలోనే ఎక్కువ పర్యటిస్తున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారు కనుక ఆ పార్టీ కోసం ప్రచారం చేయడం మిత్రధర్మమే. అయితే బీజేపీ కూడా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేస్తోందా?అంటే లేదనే చెప్పొచ్చు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ‘విశాల ప్రయోజనాల దృష్ట్యా’ బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారు.
బిఆర్ఎస్, కాంగ్రెస్‌లు హోరాహోరీ పోరాటంలో జనసేన కూకట్‌పల్లి సీటు ఒక్కటే గెలుచుకొన్నా చాలా గొప్ప విషయమే. కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టమైనందున, జనసేన తరపున ఒక్కరూ గెలిచినా, ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానిలో చేరిపోవడం ఖాయమే.
ఈసారి తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్, బిఆర్ఎస్ నుంచి భారీగా ఆఫర్లు వస్తే జనసేన ఎమ్మెల్యే పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది.
కనుక ఈ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని, పోటీ చేయడం ద్వారా జనసేన ఏమి సాధించదలిచిందనే సందేహం కలుగక మానదు. ఒకవేళ తెలంగాణలో జనసేన గెలిస్తే ఏపీ శాసనసభ ఎన్నికలలో ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. కానీ ఓడిపోతే? గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే? ‘తెలంగాణలో జనసేనకు అప్పుడే ఎదురుదెబ్బ’ అనే హెడ్డింగుతో మీడియాలో వార్తలు వస్తాయి. ఇది ఏపీలో జనసేనకు ఎంత మాత్రం మంచిది కాదు.
ఇవేవీ కాకపోతే జనసేన ఇంకేమీ సాధించాలనుకొంటోంది?బహుశః ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా చేరాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారేమో?అందుకు బీజేపీ ఒప్పుకొంటే ఇబ్బంది లేదు కానీ ఒప్పుకోకపోతే?
ఒకవేళ టిడిపిని విడిచిపెట్టి వస్తే కలిసి పనిచేద్దామని, పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరిస్తామని బీజేపీ చెపితే… అప్పుడు జనసేన ఎటువైపు ఉంటుంది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు డిసెంబర్ 3న తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లభించవచ్చు.
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…