
మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖకు వచ్చారు. తనపై తప్పుడు వార్తలు, కధనాలు రాసినందుకు సాక్షి మీడియాపై ఆయన పరువునష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ కొరకు నిన్న విశాఖ వచ్చినప్పుడు, ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
“2014-19 మద్యలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. కానీ 2019-24 మద్య కాలంలో వాటిలో చాలా వరకు వెనక్కుపోయాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక అవన్నీ వస్తున్నాయి. కానీ 2029లో మళ్ళీ వైసీపి అధికారంలోకి వచ్చి మళ్ళీ అలాగే జరిగితే మా పరిస్థితి ఏమిటి? అని పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. మీ సమాధానం ఏమిటి?” అని సూటిగా ప్రశ్నించారు.
దానికి నారా లోకేష్ కూడా సూటిగానే సమాధానం చెప్పారు. “మళ్ళీ వైసీపి అధికారంలోకి రాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంది. మేము పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పాము. తీసుకువస్తున్నాము. వాటిలో యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాము. కల్పిస్తున్నాము.
ఆనాడు విశాఖ నగరానికి లులూ గ్రూప్ కంపెనీని తీసుకువచ్చాము. అది ఏర్పాటు అయ్యి ఉండి ఉంటే సుమారు 20 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించి ఉండేవి. కానీ జగన్ ప్రభుత్వం దానిని వెనక్కు పంపించేసింది. ఆవిదంగానే వారు అమర్ రాజా కంపెనీని వేధిస్తే ఆ కంపెనీ తెలంగాణకు వెళ్ళిపోయింది.
మేము పరిశ్రమలు, తెచ్చి యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామంటే జగన్, బొత్స సత్యనారాయణ తదితరులు అదేదో తప్పన్నట్లు మాట్లాడుతున్నారు. కనుక రాష్ట్రానికి పరిశ్రమలు, వాటితో యువతకు ఉద్యోగాలు, ఉపాధి వద్దంటున్న వైసీపి మళ్ళీ అధికారంలోకి రాకూడదనుకుంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది.
ప్రజలు అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాలు కావాలనుకుంటే మళ్ళీ టిడిపి కూటమిని గెలిపించుకోవాలి. అది వారి బాధ్యతే,” అని అన్నారు.
నిజమే! ప్రజలే ప్రభుత్వాలను మార్చగలరు. రాజకీయ పార్టీలు ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ నేటికీ అత్యధిక శాతం ప్రజలు ఎవరిని కోరుకుంటే వారే అధికారంలోకి రాగలుగుతుండటం చాలా ఊరట కలిగించే విషయమే.
జగన్ 5 ఏళ్ళ పాలనలో నరకయాతన అనుభవించిన తర్వాత 2024 ఎన్నికలలో అందరూ కూడబలుక్కున్నట్లు జగన్‌కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కనుక ప్రజలలో అటువంటి చైతన్యం కలిగినప్పుడు లేదా కలిగించగలిగినప్పుడే మార్పు సాధ్యమవుతుందని నిరూపితమైంది.
జగన్ అరాచక ధోరణి వలననే రాష్ట్రంలో ఈ మార్పు కలిగిన్నట్లే, టిడిపి కూటమి ప్రభుత్వం కూడా ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేసి చూపించి మళ్ళీ తమనే ఎన్నుకునేలా చేసుకోవలసి ఉంటుంది. ప్రజలు తమ నుంచి ఏమి కోరుకొని అధికారం కట్టబెట్టారో అది మరిచిపోకూడదు.
అయితే కేవలం రాష్ట్రాభివృద్ధి చేస్తే సరిపోదని 2019లో చంద్రబాబు నాయుడుకి, 2023లో కేసీఆర్‌కి ప్రతిపక్షాలు నిరూపించి చూపాయి. కనుక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిబద్దతతో కృషి చేస్తూనే, రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా మారిన వైసీపిని రాజకీయంగా కట్టడి చేయాల్సిన బాధ్యత టిడిపి, జనసేనలపైనే ఉంది. ఈ రెంటిలో ఏది చేయలేకపోయినా మళ్ళీ ఏపీ కధ మొదటికొస్తుందని మరిచిపోకూడదు.
Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…
Ever since Lyca Productions dropped the official announcement on Indian 3, suggesting that the pending…