
దేశంలో ఎన్నికలు జరిగితే తప్పక ఓట్లేసేవారు ఎవరు? ఎన్నడూ ఓట్లు వేయని వారెవరు?
మొదటి ప్రశ్నకు సమాధానం నిరక్షరాస్యులు, నిరు పేదలు, గ్రామీణులు, సామాన్య మధ్య తరగతి ప్రజలు మరియు సెలబ్రెటీలు.
రెండో ప్రశ్నకు యువత, ఉన్నత విద్యావంతులు, మరీ ముఖ్యంగా ఐటి కంపెనీలలో పనిచేస్తున్న టెకీలు అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండో వర్గంలోని వారు మొదటి వర్గానికి మనల్ని, మన రాష్ట్రాలని, దేశాన్ని పాలించేవారిని ఎన్నుకునే బాధ్యత మొదటి వర్గానికి అప్పగించేశారన్న మాట!
మరయితే ఈ రెండో వర్గంవారు ఏం చేస్తుంటారు? ఓటు వేయడానికి వేతనంతో కూడిన సెలవు ఇస్తే, దానికి ముందూ వెనుక రోజులలో వారాంతపు సెలవులు కూడా కలిసి వస్తే హాయిగా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్ళిపోతారు.
తిరిగి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో దేశం, రాష్ట్రం పరిస్థితి గురించి బాధపడుతుంటారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని బాధపడుతుంటారు.
అలాగని వారు ఓటు వేయనంత మాత్రాన్న వారికి దేశభక్తి, దేశం పట్ల బాధ్యత లేదనుకుంటే చాలా పొరపాటే. అలాంటి దేశ భక్తులు తప్పకుండా ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తారు. భారత్‌ని గెలిపించుకునే బాధ్యత తమపైనే ఉందని గట్టిగా నమ్ముతారు. కనుక ఆఫీసులకు సెలవు పెట్టి దగ్గరుండి మరీ గెలిపించుకుంటారు. దేశభక్తి అంటే ఇదీ!
వారు ఓట్లు వేయకపోవడానికి ఒకటి కాదు వంద బలమైన కారణాలున్నాయి. ఏ పార్టీకి ఓట్లు వేసినా ప్రయోజనం లేదు. చెత్త రాజకీయాలు చూస్తే రోత పుడుతుంది. నేనొక్కడినీ ఓటు వేయకపోతే పోలింగ్ ఆగిపోతుందా? ఒక్క రోజైన ఫ్యామిలీతో గడపకపోతే ఎలా?కనుక ఇలాంటి చాలా బలమైన అనేక కారణాలతో యువత, టెకీలు పోలింగ్ రోజున విశ్రాంతి దినంగా పరిగణిస్తారు.
కనుక మొదటి వర్గం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు అసమర్ధ, అవినీతి, అరాచక పాలన చేస్తే దానికి వారే బాధ్యులు తప్ప తాము కాదని వాదించే మేధావులు రెండో వర్గంలో ఉన్నారు. కానీ మార్పు కావాలని బలంగా కోరుకున్నప్పుడు అందరూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారు.
ఉదాహరణకు 2024 ఏపీ శాసనసభ ఎన్నికలలో మొదటి వర్గానికి చెందిన వారందరూ కదిలివచ్చారు. ప్రతీ ఒక్కరూ ఓట్లు వేశారు. కనుకనే ఏపీలో ఇంత పెను మార్పు వచ్చింది. ఇంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది.
కేవలం ఒక్కసారి వచ్చి ఓట్లు వేస్తే ఇంత సత్ఫలితం కనిపిస్తున్నప్పుడు ప్రతీసారి వచ్చి ఓట్లు వేస్తే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడకుండా ఉంటుందా? అప్పుడు భారత్ అభివృద్ధిని ఎవరైనా ఆపగలరా?
కనుక ఇలాంటి మంచి మార్పు కావాలనుకుంటే ప్రతీ ఎన్నికలలో యువత, ఉన్నత విద్యావంతులు, టెకీలు ప్రతీ ఎన్నికలలో తప్పనిసరిగా ఓట్లు వేయాలి.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…