
తెలంగాణలో బీజేపీ ఓటమి ఎన్నికలకు ముందే ఖరారు అయిపోయిందని చెప్పవచ్చు. సర్వేలన్నీ కూడా అదే చెపుతున్నాయి. హైదరాబాద్, పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్ పార్టీ ఈ ఎన్నికలలో కనీసం 7 సీట్లు గెలుచుకోబోతుంటే, యావత్ దేశాన్ని పాలిస్తున్న జాతీయపార్టీ బీజేపీ దాని కంటే వెనుకబడిపోవడం సిగ్గుచేటే కదా?
అయితే ఇది స్వయంకృతాపరాధమే. కారణాలు అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు వాటి గురించి చర్చ అనవసరం. జాతీయస్థాయిలో పార్టీ అవసరాల కోసం రాష్ట్రాలలో పార్టీని బలిపీఠం ఎక్కించకూడదని ఈ ఎన్నికలు ఓ గుణపాఠం నేర్పించాయి.
బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని ఏ కారణం చేత ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్ష పదవిలో నుంచి తప్పించినప్పటికీ అందుకు ఇప్పుడు తెలంగాణ బీజేపీ మూల్యం చెల్లిస్తోంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం తన మూస వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉంచి, ఆయనకు అండగా నిలబడినందుకు తెలంగాణలో కాంగ్రెస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చే అవకాశం కలిగింది.
బిఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాల వలన బీజేపీ మాత్రమే కాదు బిఆర్ఎస్ కూడా నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. అంటే విశ్వసనీయతని పణంగా పెట్టి గేమ్స్ ఆడితే నష్టపోక తప్పదని స్పష్టమవుతోంది.
ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కూడా అదే పైచేయి సాధించడం ఖాయం. కనుక అప్పుడూ రెండు పార్టీలు మరోసారి నష్టపోక తప్పదు.
తెలంగాణలో బీజేపీ ఓటమి ప్రభావం ఏపీ బీజేపీపై కూడా తప్పక పడుతుంది. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ఏపీ రాజకీయాలలో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నందుకు, ఏపీ బీజేపీకి ప్రజాధరణ లభించడం లేదు. ఏపీలో బలపడలేకపోతోంది. చివరికి తమ ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడే వైసీపి నేతలకు కూడా ఏపీ బీజేపీ అలుసైపోయింది. ఇప్పుడు ఏపీ బీజేపీకి ఈ ఓటమి భారం కూడా తోడవబోతోంది.
ఇదివరకు తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాగే ఏపీ కాంగ్రెస్‌ని బలిపీఠం ఎక్కించింది. కానీ తెలంగాణలో గెలవలేకపోగా ఏపీలో బలంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీలతో ఇదే విదంగా వ్యవహరిస్తోంది. కనుక అటువంటి ఫలితాలే వస్తున్నాయి.
కనుక తెలంగాణ బీజేపీని చేజేతులా నష్టపరుచుకొన్న ఆ పార్టీ అధిష్టానం, కనీసం ఏపీ బీజేపీకి అండగా నిలిచి, దానిని బలోపేతం చేసుకొంటే మంచిది. మిత్రపక్షాన్ని గౌరవించి ముందుకు సాగితే మంచిది. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు.
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…