ప్రీమియర్ షోల ట్రెండ్ అలవాటుగా మారిపోతుందా?

Premiere Showsఒకప్పుడు విడుదల తేదీకి ముందే ప్రీమియర్లు వేయడం చాలా అరుదుగా ఉండేది. అది కూడా అధిక శాతం స్టార్ హీరోలకే పరిమితం చేసేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ కాలం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల ఆధిపత్యంలో నడిచేవారు కాబట్టి వాళ్లకు మాత్రమే స్పెషల్ షోలు ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి సైతం రిలీజ్ కు ముందే సినిమా చూపించాలన్న స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతోంది.

చెప్పుకోదగ్గ క్యాస్టింగే లేని బేబీకి ఏపీ తెలంగాణలో యాభైకి పైగా స్క్రీన్లలో షోలు వేస్తే అన్నీ ఫుల్లయ్యాయి. చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్ లేకుండా టికెట్లు దొరకలేదు. దీని ప్రభావం సోషల్ మీడియాలో పాజిటివ్ గా కనిపించింది. ముఖ్యంగా యూత్ ఇలాంటి వాటికి కనెక్ట్ అయిపోయి ట్వీట్లు గట్రా త్వరగా పెట్టేస్తారు కాబట్టి దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద సానుకూలంగా ఉండటం అబద్దం కాదు.

ADVERTISEMENT

క్రమంగా ఇండస్ట్రీ దీన్నో అలవాటుగా మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ ట్రెండ్ పక్కన తమిళనాడు, కర్ణాటకలో లేదు. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు మాత్రం కంటెంట్ మీద ధీమాతో ప్రత్యేక స్క్రీనింగులను గొప్ప ప్రమోషనల్ మెటీరియల్ గా వాడుకుంటున్నారు. సామజవరగమన, మేజర్, రైటర్ పద్మభూషణ్, 777 ఛార్లీ లాంటి వాటికి ఇది బ్రహ్మాండంగా పని చేయడం కళ్లారా చూశాం.

అలా అని ప్రతిసారి ఇలాంటి ఫలితాలే ఆశించలేం. రంగబలి, విరాట పర్వం లాంటి వాటికి ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. పైపెచ్చు నష్టమే చేసింది. మరోవైపు వందల కోట్ల మార్కెట్ ఉన్న బడా హీరోలు వీటికి దూరంగా ఉంటున్నారు. రిలీజ్ రోజు తెల్లవారుఝామున ఫ్యాన్స్ హడావిడి మధ్య వేయడానికి తప్ప ముందస్తు ప్రదర్శనలకు ఒప్పుకోవడం లేదు. అంతటి ఆర్ఆర్ఆర్ కూడా రిస్క్ చేయలేదు.

రాబోయే రోజుల్లో ఛోటా నిర్మాతలు అధిక శాతం దీన్నే ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అన్నే ఉన్నాయి. వీటిని సరిగ్గా బేరీజు వేసుకుని సిద్ధపడాలి తప్పించి ఏదో ట్రెండ్ ఉంది కదాని గుడ్డిగా వెళ్ళిపోతే ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా రాత్రి కిక్కిరిసిపోయిన థియేటర్లు మరుసటి రోజు సాయంత్రానికి ఖాళీ అవుతాయి. అందుకే క్యాలికులేషన్లు చాలా అవసరం. దానికి తగ్గట్టు సరైన పబ్లిసిటీని ప్లాన్ చేసుకోవడం కీలకం.

ADVERTISEMENT
Latest Stories