
తెలంగాణ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘బంగారి తెలంగాణ సాధన’ పేరుతో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఇలాగే తన పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నారు.
అప్పుడు ఆయనకు, బిఆర్ఎస్ పార్టీ నేతలకు అది తప్పుగా అనిపించలేదు. వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, టిడిపిలు స్పీకర్‌కి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. హైకోర్టుని ఆశ్రయిస్తే స్పీకర్ పరిధిలో ఉన్న ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.
కానీ అదే హైకోర్టు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు… తెలంగాణ శాసనసభ కార్యదర్శికి నాలుగు వారాల గడువు విధించింది.
ఆలోగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ ప్రారంభించేందుకు షెడ్యూల్ రూపొందించి, ఆ వివరాలను తమకి అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ శాసనసభ కార్యదర్శి విచారణకు ఏర్పాటు చేయకపోతే తామే జోక్యం చేసుకోవలసి వస్తుందని హెచ్చరించింది కూడా.
ఈ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప దెబ్బ వంటిదని కేటీఆర్, హరీష్ రావు తదితరులు అన్నారు. అయితే దీని వలన కాంగ్రెస్ నష్టపోతుందా? అంటే కాదు బిఆర్ఎస్ పార్టీయే అని చెప్పవచ్చు.
ఒకవేళ తెలంగాణ శాసనసభ స్పీకర్ విచారణ జరిపి వారిపై అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది? ఖాళీ అయిన ఆ 10 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలోనే గెలవలేక చతికిలపడిన బిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో గెలవగలదా?అంటే కష్టమే అని చెప్పొచ్చు.
మొత్తం పది స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు వాటిలో రెండో మూడో తప్పకుండా గెలుచుకోవచ్చు. కానీ మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవడం ఖాయం. అంటే శాసనసభలో కాంగ్రెస్‌కి సొంత ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందన్న మాట!
వాటికి ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వకూడదనుకుంటే, ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా 3-4 మందిపై వేసి ఉప ఎన్నికలు జరిగిన తర్వాత విచారణ పేరుతో మరో ఏడాది సాగదీసి మళ్ళీ మరో 3-4 చొప్పున అనర్హత వేటు వేస్తూ మొత్తం 10 మందిని కాంగ్రెస్ పార్టీయే గెలిపించుకున్నా ఆశ్చర్యం లేదు. కనుక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించగలిగినా బిఆర్ఎస్ పార్టీకి బహుశః ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…