కమర్షియల్ సినిమాలకు ఇక స్వస్తేనా.?

Will There Be an End to Commercial Movies?

ఒకప్పుడు సినీ ప్రపంచాన్ని ఏలిన కమర్షియల్ మూవీస్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా చతికిలపడుతున్నాయి. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని మాస్ డైలాగ్స్, కొంచెం గ్లామర్ డోస్, ఒక ఐటమ్ సాంగ్ తో థియేటర్లలో విజిల్స్ వేయించిన అటువంటి సినిమాలకు నేడు కాలం చెల్లింది.

బాహుబలి సినిమాతో ప్రేక్షకుడు మూవీ ని చూసే విధానాన్నే మార్చేశారు జక్కన్న.ఇండస్ట్రీకి కొత్త దర్శకులు, కొత్త ఐడియాలతో ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటున్న ఈ సమయంలో కూడా కొంత మంది దర్శకులు ఆ పాత చింతకాయ పచ్చడినే కొత్త జాడీలో పెట్టి థియేటర్లలో వదులు తున్నారు.

ADVERTISEMENT

అయితే అటువంటి దర్శకుల కంటే భిన్నం గా ఆలోచిస్తున్న ప్రేక్షకుడు అటువంటి సినిమాలకు థియేటర్లు అవసరం లేదని ఓటిటీ చాలు అని సంకేతాలు ఇస్తున్నా ఇంకా ఆ మూస కథలనే నమ్ముకుని సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుల కళా నైపుణ్యాన్ని ఎలా వర్ణించాలి.

నేడు ఇండస్ట్రీలో హీరోల ప్రభావంతో సరి సమానంగా దర్శకుల టాలెంట్ కు మంచి గుర్తింపు లభిస్తుంది. టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన దర్శక దిగ్గజం రాజమౌళి ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో కొత్త రక్తం ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగమే నాగ అశ్విన్ కల్కి.

స్టార్లతో పని లేదు కంటెంట్ ఉంటే చాలు అని నిరూపించింది జై హనుమాన్. అలాగే ఎంటర్టైన్ మెంట్ మోడ్ లో వచ్చిన టిల్లు స్క్వేర్ కమెర్షియల్ సక్సెస్ చూసింది. అయితే గతంలో స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్లిచ్చిన దర్శకులు ఇప్పుడు స్టార్ హీరోలను జీరో లుగా మారుస్తున్నారు.

ఈ ఆగస్టు పదిహేను థియేటర్ల ముందుకొచ్చిన మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. అయితే ఈ సినిమాల ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఏ కంటెంట్లో కూడా ఈ మూవీలో కొత్తదనాన్ని చూపించలేకపోయారు దర్శకులు.

అలాగే హీరోలు కూడా హిట్ కాంబో కుదిరింది కదా అనో, సీక్వెల్ చెయ్యాల్సిందే అనో, లేక తమకు మాస్ ఇమేజ్ వచ్చేస్తుందనో ఇటువంటి సినిమాలకు ఓకే చెపితే ఉన్న ఇమేజ్ కూడా దెబ్బ తినే అవకాశం ఉంది.

అలాగే పూరి, హరీష్ శంకర్, బోయపాటి, శంకర్ వంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకులు ఇప్పుడెందుకు చతికలపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. హిట్ అయినా ఒక సినిమా తీయ్యాలి, ఫ్లాప్ అయినా సినిమానే తియ్యాలి అని చెప్పే పూరి హిట్ సినిమా ఎందుకు తీయలేకపోతున్నా అని స్థిమితంగా ఆలోచించుకోవాలి.

కాంట్రవర్సీలతో కాదు కంటెంట్ తో రావాలి అని హరీష్ అనుకుంటే మరో మిరపకాయ లాంటి మూవీ తో అలరించవచ్చు. ఇండియన్ 2 దెబ్బకు రామ్ చరణ్ గేమ్ ఛేంజెర్ పై ఆందోళన చెందుతున్నారు చెర్రీ ఫాన్స్. గ్లోబర్ స్టార్ ఇమేజ్ గేమ్ ఛేంజెర్ తో ఎక్కడ మసక బారుతుందో అన్న దిగులు మెగా అభిమానులను కలవరపెడుతుంది.

ఇక బోయపాటి విషయానికి వస్తే ఈయన గారి అరాచకాన్ని మ్యాచ్ చెయ్యగలిగిన ఏకైక స్టార్ నందమూరి బాలకృష్ణ మాత్రమే అని స్పష్టమయిన నేపథ్యంలో అడపాదడపా ఆయనతోనే సినిమాలు తీసుకుని ఇండస్ట్రీలో ఆయనకున్న ఇమేజ్ ను నిలబెట్టుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories