
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాను చాలా తెలివిగా పావులు కదుపుతూ టిడిపి కూటమి ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని దెబ్బ తీస్తున్నానని ఎప్పుడూ భ్రమలో ఉంటారు.
ఆయనకు ఆ భ్రమని తొలగించాల్సిన సొంత మీడియా పక్క వాద్యాలు వాయిస్తూ ‘నిజమే జగన్ దెబ్బకి ప్రత్యర్ధులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఇప్పుడు ఈ సమస్యలో నుంచి ఎలా బయటపడాలో తెలీక గిలగిలా కొట్టుకొంటున్నారు,” అని సినిమాలో హీరోకి ఎలివేషన్స్ ఇచ్చిన్నట్లు జగన్‌ని మునగ చెట్టు ఎక్కించేస్తుంటాయి. కనుక 11 సీట్లతో చేతులు కాల్చుకునే వరకు మోగిన పక్క వాయిద్యాలు నేటికీ అలా మోగుతూనే ఉన్నాయి.
కోర్టు విచారణాలలో వందలు, వేల పేజీల డాక్యుమెంట్స్ సమర్పిస్తున్నట్లే, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను అయోమయపరిచి తాను ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి కూడా సొంత మీడియాలో టన్నుల కొద్దీ నెయ్యి లెక్కలు పారించేస్తున్నారు.
అయితే జగన్, సొంత మీడియా ఎంత గొంతు చించుకున్నా తిరుమలలో చాలా అపచారం చేసిందనే భావన ప్రజలకు ఏర్పడిపోయింది. దానిని తొలగించడం జగన్ వలన కాదు. అందుకు ఇంకా ఎన్ని వేల పేజీలలో ఎన్ని టన్నుల నెయ్యి కార్చినా ఉపయోగం ఉండదు.
సరే! కల్తీ నెయ్యి ఊబిలో తెలియక కూరుకుపోయినప్పడు ఏం చేయాలి?తెలివైనవారైతే ఈ వివాదం తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.
కానీ చంద్రబాబు నాయుడుని దెబ్బకి దెబ్బ తీయాలనే కసి, ఆవేశంలో ‘తిరుమల దర్శనానికి బయలుదేరుతున్నానని’ ప్రకటించి జగన్ మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయారు.
ఆ ప్రకటన చేయగానే ఆయన క్రీస్టియన్ అనే విషయం బాగా హైలైట్ అయ్యింది. కనుక జగన్ ‘డిక్లరేషన్’పై సంతకం చేయాలనే డిమాండ్ పుట్టుకొచ్చింది. ఇలా జరుగుతుందని బహుశః జగన్ కూడా ఊహించి ఉండరు.
అయినా ‘స్వామివారిపై నాకు చాలా నమ్మకముంది’ అని నోటితో చెపుతున్నప్పుడు ‘డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదని’ ఒక్క మాట చెప్పి ఉంటే అప్పుడు టిడిపి, బీజేపీ, జనసేనలే ఆత్మరక్షణలో పడేవి.
కానీ అంతలోనే భూమా కరుణాకర్ రెడ్డి ఆవేశంతో మేము డిక్లరేషన్ మీద సంతకం చేయము… ఎవరు అడ్డుకుంటారో మేమూ చూస్తాం,” అని సవాలు చేశారు. అంటే వైసీపి దీనిపై రాజకీయాలు చేస్తోందని స్వయంగా చాటింపు వేసిన్నట్లయింది.
అక్కడ భూమా నోరు జారితే, ఇక్కడ జగన్ దానిని సరిదిద్దవచ్చు. కానీ “ఇదేం దేశం… ఇదేం రాష్ట్రం… ఇదేం ప్రభుత్వం…ఇదేం మతం… నా మతం మానవత్వం అని డిక్లరేషన్‌లో రాసుకోండి,” అంటూ పంచ్ డైలాగులు కొట్టి మళ్ళీ దొరికిపోయారు.
ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, మతాన్ని ఈసడించుకున్న జగన్‌కి దేశబహిష్కరణ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అది అప్రస్తుతం.
కానీ ఓ వివాదంలో చిక్కుకొన్నప్పుడు దానిలో నుంచి ఏవిదంగా బయటపడాలో కూడా తెలీని జగన్, చంద్రబాబు నాయుడుని దెబ్బ తీశానని భుజాలు చరుచుకోవడం, ఆయనకు వందిమాగాధులు పొగడటం చూస్తుంటే విడ్డూరంగా ఉంది.
The TDP, Jana Sena and BJP scripted a major victory in the 2024 Andhra Pradesh…
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…