
శాసనసభ సమావేశాలు మొదలవుతుంటే, వైసీపీ ‘ప్రధాన ప్రతిపక్ష హోదా’ స్టోరీ వినపడుతుంటుంది. స్కూలుకి ఎగ్గొట్టినందుకు చిన్న పిల్లాడైన గిల్టీ ఫీల్ అవుతాడేమో కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్ మాత్రం శాసనసభ సమావేశాలకు రానందుకు ఏ మాత్రం సిగ్గు పడరు. పైగా ప్రభుత్వాన్ని, స్పీకరునే నిందిస్తుంటారు కూడా.
ఆయన సంగతి సరే! మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం చేస్తున్నట్లు?అంటే వరుసగా 60 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరిస్తుంటారు… అని అనడం కంటే ‘వచ్చి అటెండన్స్ వేసుకోమని’ జగన్‌కు గుర్తుచేస్తున్నారని చెప్పవచ్చు.
వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్ ఇంకా ఏమేమి చేస్తారు?అంటే శాసనసభ సమావేశాలకు రాని ఎమ్మెల్యేల జీతభత్యాలు కోసేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ శాసనసభ స్పీకర్ల సమావేశంలో తెలుగులో చెప్తారు. ‘నో వర్క్ నో పే విధానం’పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని విజ్ఞప్తి చేస్తారు!
శాసనసభ సమావేశాలు ఏడాది పొడవునా ప్రతీరోజూ జరుగవు. మూడు నెలలకోసారి నాలుగైదు రోజులు లేదా వారం పది రోజుల పాటు మాత్రమే సాగుతాయి. కానీ సమావేశాలు జరగని రోజుల్లో కూడా శాసనసభ సిబ్బంది ప్రతీ రోజూ డ్యూటీకి రావాల్సి ఉంటుంది.
ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, చివరికి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికులు కూడా ప్రతీరోజూ తప్పనిసరిగా డ్యూటీకి రావాల్సిందే. లేకుంటే జీతాలలో కోతలు తప్పవు. కానీ నాలుగైదు రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాలకు వచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తీరిక ఉండదు! వారు రాకపోయినా జీతభత్యాలలో కోతలు కూడా ఉండవు. ఎందువల్ల?
కలుషిత రాజకీయాల వలన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా పోయింది. ఎవరిని ఏ ప్రభుత్వం పక్కన పెట్టేస్తుందో, ఎప్పుడు సస్పెండ్ చేసి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుందో తెలీని పరిస్థితి. కానీ ముప్పతిప్పలు పెడుతున్న ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు సైతం నూటికి 200 శాతం ఉద్యోగ భద్రత ఉంటుంది!
శాసనసభకు రాకపోయినా ఎటువంటి చర్యలు ఉండవు… నెలనెలా టంచన్‌గా జీతభత్యాలు వచ్చేస్తాయి. శాసనసభకు వెళ్ళకపోయినా ప్రజలు కూడా గెలిపిస్తూనే ఉంటారు… అనే ధీమా వల్లనే ప్రజా ప్రతినిధులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. శాసనసభకు రావడానికి ఇష్టపడని వైసీపీ అధినేత జగన్ అధికారం కోసం పాదయాత్ర చేస్తారట!
పదవి, నిర్ణయాధికారం అన్నీ చేతిలోనే ఉన్నా శాసనసభకు రానివారిపై చర్యలు తీసుకోలేనప్పుడు, తెలుగు అర్థం కాని హిందీ స్పీకర్లతో మన గోడు మొరపెట్టుకొని ఏం ప్రయోజనమయ్యా?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…