
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నిన్న విజయనగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. కనుక వద్దని మేము ఈ కూటమి ప్రభుత్వానికి పదేపదే చెపుతున్నాము. కానీ వినడం లేదు.
ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఓ అవకాశం ఇస్తే తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలనే ఈవిధంగా మోసం చేస్తోంది. రేపు ఎలాగూ మళ్ళీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మా ప్రభుత్వం రద్దు చేస్తుంది. అవసరమైతే దీని కోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేస్తాము.
కనుక ప్రభుత్వంతో కుమ్మకు అయ్యి ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకుంటున్న వారందరూ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నాను. లేకుంటే రేపు వారికిచ్చిన అనుమతులు రద్దు చేస్తే వారే నష్టపోతారు,” అని హెచ్చరించారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయినా సిఎం చంద్రబాబు నాయుడు నిబ్బరంగా ముందుకు సాగారు. ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చారు.
కానీ ప్రజలు ఆయనని కాదని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. చేస్తే ఆయన ఏం చేశారో బొత్స సత్యనారాయణతో సహా అందరికీ తెలుసు.
వైసీపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో 5 ఏళ్ళు అధికారంలో ఉంది. వైసీపీకి పేద ప్రజల పట్ల ఇంత ఆరాటం, నిబద్దత ఉండి ఉంటే అప్పుడే వాటిని పూర్తిచేసి ప్రారంభించాలి కదా?
కానీ అప్పుడు రాష్ట్రంలో ఎక్కడికక్కడ రాజభవనాల వంటి పార్టీ కార్యాలయాలు కట్టుకుంది. వాటన్నిటికీ హెడ్-ఆఫీస్ అన్నట్లు రుషికొండపై మరికొన్ని ప్యాలస్‌లు నిర్మించుకుంది. కానీ మొదలుపెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలేశారు.
అందువల్లే ప్రజలు జగన్‌ని గద్దె దించేసి మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలే కూటమి ప్రభుత్వానికి చాలా భారంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వం ఓ పక్క అమరావతి, పోలవరం వంటి రెండు మెగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
కనుక జగన్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకుంది. కనుక ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యంలో పూర్తిచేస్తోంది.
ప్రభుత్వానికి తగినంత ఆదాయం ఉండి ఉంటే ఈవిధంగా చేయడం ఖచ్చితంగా తప్పే. కానీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిలో ఇదే సరైన నిర్ణయమని చెప్పక తప్పదు. దీనినే తప్పు పడుతూ వైసీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా ఇప్పుడు మెడికల్ కాలేజీలపై ఈవిధంగా దుష్ప్రచారం చేస్తోంది. అంతటితో ఆగకుండా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణకు ముందుకు వచ్చినవారిని కూడా ఈవిధంగా బెదిరిస్తోంది.
ఈవిధంగా అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ కూడా ప్రజలు తమనే ఎన్నికలలో గెలిపిస్తారని, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని పగటి కలలు కూడా కంటోంది. ఈసారి 175కి 175 సీట్లుమావే అని మిడిసిపడితే ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. ఇలాగే వ్యవహరిస్తుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇవ్వకపోవచ్చు.
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…