మన భోళాశంకర్‌కు అన్ని మంచి శకునాలే!

YS Jagan Effect to Rajinikanth Jailer Chiranjeevi Bholaa Shankar  ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకి రజనీకాంత్‌ వచ్చి చంద్రబాబు నాయుడు గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడటం ఏపీలో ఆయన ‘జైలర్’ సినిమా విడుదలపై ప్రభావం చూపేలా ఉంది. మొగుడు కొట్టినందుకు ఏడవటం లేదు… తోడికోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాన్నట్లు… రజనీకాంత్‌ తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టనందుకు వారు బాధపడలేదు… చంద్రబాబు నాయుడుని పొగిడినందుకు బాధపడ్డారు. వారి ఏడ్పులు చూసి జనాలు కూడా నవ్వుకొన్నారు. నవ్వితే నవ్విపోదురుగాక మాకేటి… మా జగనన్న సంతోషిస్తే అదే మాకు పది టికెట్లతో సమానమనుకొన్న మంత్రులు పోటీలు పడీ మరీ రజనీకాంత్‌ని తిట్టారు. క్లైమాక్స్‌ సీన్‌లో వచ్చిన పోసాని కృష్ణ మురళి కూడా “తమిళనాడుకి రజనీ సూపర్ స్టారయితే… మెగాస్టార్ చిరంజీవి మావాడంటా….” అంటూ పాడి జగనన్న రుణం తీర్చుకొన్నారు. తద్వారా చిరంజీవిని వైసీపీ ఓన్ చేసుకొందని తెలియజేశారు.

రజనీకాంత్‌ ‘తోడేళ్ళ బ్యాచ్‌’లో ఒకరని, చిరంజీవి మనలో ఒకరని ఖరారు చేసేసుకొన్నారు కనుక, ఇప్పుడు ఆగస్ట్ 10న విడుదల కాబోతున్న జైలర్, 11న విడుదల కాబోతున్న భోళాశంకర్‌ సినిమాల గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడుకోక తప్పదు.

ADVERTISEMENT

ఏపీ రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న రజనీకాంత్‌ని “రాజకీయాలు మాట్లాడొద్దురా… రజనీ…” అంటూ అంతరాత్మ హెచ్చరిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మీద వాత్సల్యంతో ఆయన గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడేశారు. ఇప్పుడు అదే ‘జైలర్’ కొంపముంచేలా ఉంది.

వైసీపీ ప్రభుత్వం కక్షగడితే లక్షల కోట్లతో నిర్మిస్తున్న అమరావతి కూడా పాడుబడుతోంది. ఇక జైలర్ ఏపాటి? ఏపీలో జైలర్‌ రిలీజ్‌కి ఎలాంటి కష్టాలు వస్తాయో ఇదివరకు రిలీజ్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణ సినిమాలు చెపుతాయి.

ఇక భోళాశంకర్‌ని మనోడని వైసీపీ అనుకొంటోంది ఈమేరకు చిరంజీవికి కలిసి వచ్చిన్నట్లే. ఈ కారణంగా జైలర్‌ కష్టాలు మరికాస్త పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈలోగా శత్రుమూకలకి చెందిన మరో దుష్టుడు పవన్‌ కళ్యాణ్‌ ఎలాగూ వారాహి వేసుకొని ఏపీలో ఓ రౌండ్ కొట్టడం ఖాయం. అదీ… భోళాశంకర్‌కి లభించిన ఫ్రీ ప్రమోషన్‌గానే భావించవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ మీద వైసీపీ అధినేత కోపం చిరంజీవికి ఎంతో కొంత మేలు చేయవచ్చు. కనుక భోళాశంకర్‌ ప్రేక్షకులను కాస్త మెప్పించగలిగితే చాలు…కాగల కార్యం గంధర్వులే పూర్తి చేసేస్తారు.

ADVERTISEMENT
Latest Stories