
తెలంగాణ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ప్రతిపక్షాలపై పడలేదు కానీ అధికార వైసీపిపై మాత్రం బాగానే ప్రభావం చూపుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసిన జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో నాలుగు నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసి తన మంత్రులు, ఎమ్మెల్యేలకు వరుసపెట్టి షాకులు ఇస్తున్నారు.
ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి ఈసారి టికెట్ రాదని జగ్గంపేట నుంచి ఈసారి తానే పోటీ చేయబోతున్నానని తోట నర్సింహం చెప్పిన రెండు రోజులకే చంటిబాబు స్థానంలో తోట నర్సింహాన్ని ఇన్‌చార్జిగా జగన్ నియమిస్తున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుని జగన్ పక్కన పెట్టబోతున్నారని ఇటీవలే ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్‌చార్జిగా నియమిస్తున్నారు.
రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి మద్య ఆధిపత్యపోరు పతాకస్థాయి చేరుకోవడంతో పిల్లి పార్టీని వీడేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. మంత్రి వేణుగోపాల కృష్ణని అక్కడి నుంచే తప్పించేస్తానని అప్పుడే ఆయనకు నచ్చజెప్పారు.
చెప్పిన్నట్లుగానే వేణుగోపాల కృష్ణని రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం లేదా లోక్‌సభకు పోటీ చేయాలని జగన్ చెప్పేసి, రామచంద్రాపురాన్ని మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి అప్పగించేస్తున్నారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ని ఈసారి రాజమండ్రి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందని జగన్ చెప్పిన్నట్లు తెలుస్తోంది.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ సెంట్రల్‌కి మార్చబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపిలో ఈ మార్పులు దాదాపు ఖరారైపోయాయి. నేడో రేపో అధికారికంగా ప్రకటించడం లాంఛనప్రాయమే.
అయితే ఈ మార్పులతో ఎమ్మెల్యే పదవులు కోల్పోబోతున్నవారు, ఒకరి అడ్డాలోకి కొత్తగా మరొకరు ప్రవేశిస్తుండటంతో స్థానిక వైసీపి ఎమ్మెల్యే, వారి అనుచరులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఇంతకాలం ఎంతో కష్టపడి పనిచేసి నియోజకవర్గంపై పట్టుసాధిస్తే ఇప్పుడు ఎన్నికలకు ముందు వేరే నియోజకవర్గానికి వెళ్ళి పనిచేసుకోమంటే ఎలా?అని కొందరు బాధపడుతుంటే, ఎన్నికలకు ముందు తమని పక్కన పెట్టేస్తే తమ పరిస్థితి ఏమిటని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు చేస్తున్న ఈ మార్పులతో తన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధృవీకరిస్తున్నట్లవుతోంది. ఇది వారికి చాలా ఇబ్బందికరంగా మారి ప్రజల ముందు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి కలుగుతోంది.
ఈ మార్పులు, చేర్పులన్నీ మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం కోసమే అని అర్దమవుతూనే ఉంది. కానీ ఇదే కారణం వలన వైసీపిలో తిరుగుబాటు జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపిలో ‘జగన్ బాధితులు’ పుట్టినరోజు వేడుకల పేరుతో లేదా మరోపేరుతో రహస్య సమావేశాలు నిర్వహించుకొంటున్నారు.
కనుక మూడు రాజధానులు, చంద్రబాబు నాయుడు అరెస్టుతో సహా ఇంతవరకు జగన్ చేసిన రాజకీయ ప్రయోగాలన్నీ బెడిసికొట్టిన్నట్లే ఈ ప్రయోగమూ బెడిసికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జగన్ చేస్తున్న ఈ చిట్టచివరి ప్రయోగం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు చాలా అవసరమే. అప్పుడే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది కదా?
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has asked ministers to prepare for the upcoming…
Political support for Telugu films is not new, but it often becomes a talking point…