
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏమయ్యేదో తెలీదు కానీ రాకపోవడం వలన అన్ని పార్టీలకు చాలా మేలే జరిగిందని చెప్పక తప్పదు. బీజేపీ, టిడిపి, వైసీపి పార్టీలు హోదాని ఎడాపెడా వాడేసుకొని ఎంతో కొంత రాజకీయంగా లాభపడ్డాయి.
జనసేన కూడా హోదా ఆటలో పాల్గొంది కానీ లబ్ధి పొందలేకపోయింది. మేము వండి వడ్డించిన ‘ప్రత్యేక హోదా’ అన్ని పార్టీలకు ఇంతగా ఉపయోగపడినప్పుడు మాకు మాత్రం ఎందుకు ఉపయోగపడద? అనుకుంటూ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా వాడేసుకోని లాభపడాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ తలెత్తుకొని మాట్లాడేందుకు ప్రత్యేక హోదాయే అక్కరకు వస్తోందిప్పుడు.
వైఎస్ షర్మిల తెలంగాణలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తానంటూ తిరిగేవారు. కానీ ఏపీలో ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ ‘ట్రంప్ కార్డు’ పూర్తిగా వాడేసుకొని ‘రాజన్న రాజ్యం’ స్థాపించేశారు కూడా.
కనుక ఇప్పుడు ఆమెకు ‘మరో రాజన్న రాజ్యం’ స్థాపించే అవకాశం లేకుండా పోయింది. కనుక ఆమె ‘ప్రత్యేక హోదా అస్త్రం’ పట్టుకొని దిగి, ‘ఇందిరమ్మ రాజ్యం’ స్థాపిస్తానంటూ తిరుగుతున్నారు.
ఈ అస్త్రాన్ని కూడా తన అన్న ఎడాపెడా వాడేసుకున్నప్పటికీ ఇంకా దానిలో కొంచెం సారం ఉండిపోయిందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. కానీ వట్టిపోయిన ఆవు నుంచి పాలు పితికే ప్రయత్నంలో ఒకప్పుడు తన అన్న చెప్పిన డైలాగులనే మళ్ళీ తాను కూడా వల్లెవేస్తున్నాననే సంగతి ఆమె గుర్తించిన్నట్లు లేదు.
ఆనాడు ప్రత్యేక హోదా రాకపోతే ఏపీలో ‘బిడ్డల’ పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో జగన్ చదివిన ప్రసంగ పాఠాలు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. వైఎస్ షర్మిల వాటిని డౌన్‌లోడ్ చేసుకొని వాటికి తన కన్నీటిని కూడా జోడించి చాలా భావోద్వేగంతో చెపుతున్నారు అంతే! మిగిలినవన్నీ సేమ్ టూ సేమ్.
ఆనాడు మోడీ, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన అన్న జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను గొర్రెలను చేశారని వైఎస్ షర్మిల కన్నీళ్ళు పెట్టుకున్నారు.
కానీ ఆమె కూడా మమ్మల్ని గొర్రెలుగా భావించి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్న సంగతి ఆమెకు అవసరం లేదు.
కేంద్రంలో మళ్ళీ మోడీ నాయకత్వంలోనే ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని ఖరాఖండీగా చెప్పేశారు. ఏపీలో ఎవరూ అడిగే సాహసం కూడా చేయలేదు. కనుక అందుకే అది ఓ పాచిపోయిన లడ్డూ అని పవన్ కళ్యాణ్ ఎప్పుడో తేల్చి పడేశారు కూడా.
ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ రాలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలహీన పడుతుంది కనుక అధికారంలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలీని పరిస్థితి. ఒకవేళ ఎప్పుడో అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణతో సహా దేశంలో చాలా రాష్ట్రాలు మాకూ ఇవ్వాలని పట్టుబడతాయి.
కనుక కాంగ్రెస్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు… అని అర్దమవుతున్నప్పుడు వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ అంటూ మాట్లాడటం ప్రజలను గొర్రెలను చేసి ఓట్లు దండుకోవాలనే కదా? ఏదోలా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుంటే, దాంతో తన రాజకీయ జీవితం కూడా చక్కబడుతుందనే కదా?
కనుక ప్రత్యేక హోదా ఏపీకి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకపోయినా కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలనుకుంటోంది. కనుక ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ఆఖరు పార్టీ కాంగ్రెస్ పార్టీయే కావాలని కోరుకొందాము.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…