
మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్వర్యంలో గురువారం ‘ఛలో సచివాలయం’ నిరసన ర్యాలీ ఆమె అరెస్టుతో ముగిసింది. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం చేతకాలేదు.
రైతులను ఆదుకోవడం చేతకాలేదు. రాజధాని, పోలవరం కట్టడం చేతకాలేదు. స్పెషల్ స్టేటస్ సాధించడం చేతకాలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే అడ్డుకోవడం చేతకాలేదు. కనీసం రాష్ట్రంలో ఒక మెట్రో రైలు ఏర్పాటు చేయడం చేతకాలేదు.
మరైతే ఈ ముఖ్యమంత్రికి ఏమి చేతనవుతుంది? అంటే జర్నలిస్టులని చితకాబాదడం, ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్షాలను పోలీసులతో అడ్డుకొని వారిపై కేసులు నమోదు చేయడం, దౌర్జన్యాలు చేయడం మాత్రమే చేతనవును. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెపుతున్నా కూడా వారికి ఈ ప్రభుత్వం ఎందుకు ఊడిగం చేస్తోంది?” అని ప్రశ్నించారు.
వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి అసమర్ధుడు, అవినీతిపరుడు అని రోజూ విమర్శిస్తున్నారు. మరి అటువంటప్పుడు అదే కుటుంబానికి చెందిన ఆమెను ప్రజలు ఎందుకు నమ్మాలి?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను బీజేపీ, వైసీపిలు మోసం చేస్తున్నాయని ఆమె వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి ఏపీని చావు దెబ్బ తీసింది కాంగ్రెస్ పార్టీయే కదా?మరి దానిని, దాని తరపున ప్రజల వద్దకు వస్తున్న ఆమెను ఎందుకు నమ్మాలి?
ఆమె ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తన అన్నని విమర్శిస్తుండటం ద్వారా ప్రజల దృష్టిని బాగా ఆకట్టుకోగలుగుతున్నారు. అయితే తన అన్న వైఖరి, పాలన రెండూ బాగోలేవని చెపుతున్నప్పుడు, ఆమె ప్రజల నుంచి ఏమి ఆశిస్తున్నారో చెప్పడం లేదు.
కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎన్నికలలో గెలిపించమని ఆమె ప్రజలను అభ్యర్ధించడం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏవిదంగా ముందుకు సాగబోతోందో చెప్పడం లేదు. తమ పార్టీ భవిష్య కార్యాచరణ గురించి చెప్పకుండా మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదు కనుక దాని గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. కానీ ఈసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, ప్రత్యేక హోదా గురించి పదేపదే మాట్లాడుతూ, ఆమె కూడా ఆంధ్రా ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నిస్తున్నారు కదా? కనుక ఆంధ్రా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, ఆమెని ఎందుకు నమ్మాలో చెప్పగలిగితే బాగుంటుంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…