
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపడుతూనే అన్న జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నేటి నుంచి జిల్లా యాత్రలకు బయలుదేరారు. ఆమెకు ఊసుపోక ఊరికే ప్రజలను పరామర్శించడానికి బయలుదేరలేదు.
కనుక మళ్ళీ వైసీపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులను ఏపీలో జగన్ పాలన ఏవిదంగా ఉందో అడిగి తెలుసుకున్నారు.
దారిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను జగన్ రెడ్డిగారూ అని సంభోదిస్తే, వైవీ సుబ్బారెడ్డిగారికి నచ్చలేదు. కనుక ఇకపై అన్నగారూ అనే సంభోదిస్తాను. ఏపీ చాలా అభివృద్ధి చెందిందని కావాలంటే చూపిస్తానని వైవీ సుబ్బారెడ్డిగారు అన్నట్లు విన్నాను. నాకు కూడా ఏపీలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూడాలనే ఉంది.
మన రాజధాని ఎక్కడుంది?మెట్రో రైలు ఎక్కడుంది?పోలవరం పూర్తి చేసేశారా లేదా? తెలుసుకోవాలని నాతో పాటు ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులు కూడా తహతహలాడుతున్నారు. కనుక వైవీ సుబ్బారెడ్డిగారు సవాలుని నేను స్వీకరిస్తున్నాను. ఆయన డేట్, టైమ్, ప్లేస్ చెపితే అక్కడికి వస్తాము. రాష్ట్రాభివృద్ధి గురించి మీడియా ఎదుటే మాట్లాడుకుందాము,” అని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
వైఎస్ షర్మిలకు మహిళా మంత్రుల చేత జగన్ సమాధానం చెప్పిస్తారని ముందే చెప్పుకున్నాము. అలాగే మంత్రి రోజా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారు. మంగళవారం వడమాల పేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఏపీకి మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వైఎస్ షర్మిల. రాష్ట్రాన్ని విడగొట్టిన, వైఎస్సార్ పేరుని ఎఫ్ఐఆర్‌లో చేర్చి, జగన్మోహన్ రెడ్డిపై అక్రమస్తుల కేసులు నమోదు చేసి 16 నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడం చాలా బాధాకరం. పైగా రాష్ట్రంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న సొంత అన్నను ఆమె విమర్శిస్తుండటం ఇంకా బాధాకరం. ఆమె ఎంతగా ప్రయత్నించినా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి, ఆమెకు స్థానం ఉండదు,” అని మంత్రి రోజా అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించేందుకు, జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్ షర్మిల సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం బాగానే కనిపెట్టింది. వైఎస్ షర్మిల వచ్చేరాగానే ఏపీలో దూసుకుపోతున్నారు. కనుక ఇక నుంచి ఆమె రోజూ అన్నకు, వైసీపి నేతలకు సినిమా చూపిస్తూనే ఉంటారు. కనుక ఆమెను ఎదుర్కోవవడానికి వైసీపి సిద్దం కావలసిందే.
వైసీపీ నేతలు ఆమెను నేరుగా విమర్శించలేక చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేయబోతున్నట్లు రోజా మాటలతో స్పష్టమవుతోంది.
కానీ ఏపీ అభివృద్ధి అనేది కంటికి కనిపించని ‘దేవతా వస్త్రం’ వంటిదే కనుక వైసీపి నేతలు దానిపై ఎంతైనా వితండవాదనలు చేయవచ్చు. కానీ అమరావతి, పోలవరం, మెట్రో, స్పెషల్ స్టేటస్ గురించి వైఎస్ షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానాలు సిద్దం చేసుకుంటే మంచిది.
Andhra Pradesh has proposed a ₹20,369 crore plan to widen busy two-lane national highways into…
Varsha Rekhate turns a rainy backdrop into a style moment in this striking gallery. Dressed…