
అక్రమస్తుల కేసు విచారణ పూర్తికాకుండా సాగదీసుకు పోవడం వలన లాభమే తప్ప నష్టం లేదని స్పష్టమైంది. కానీ అదేవిదంగా వివేకా హత్య కేసు విచారణ కూడా పూర్తికానీయకుండా 5 ఏళ్ళు సాగదీస్తే బెడిసికొడుతోంది. గత ఎన్నికలలో వైసీపి విజయానికి తోడ్పడిన ఆ దురదృష్టకర హత్యే ఈసారి వైసీపి మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది.
వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సౌభాగ్యలక్ష్మి తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ, “వివేకా హంతకులను జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నారు. తన కోసం చివరి నిమిషం వరకు పనిచేసిన బాబాయ్‌ని చంపినవారిని శిక్షించకపోగా, ఆయనకు న్యాయం జరగాలని పోరాడుతున్న మా కుమార్తె సునీతా రెడ్డికి సాయపడకపోగా, ఆమె మీద తన పార్టీ నేతల చేత వేధిస్తున్నారు.
జగన్ ఇలాంటి వాడని మేము ఎన్నడూ అనుకోలేదు. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించి పొరపాటు చేయవద్దని, ఓడించాలని మా కుమార్తె సునీతా రెడ్డి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈసారి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని ఓడించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
కడపలో జరిగిన వివేకా 5వ వర్ధంతి సభలో సునీతా రెడ్డి మాట్లాడుతూ, “నేను హంతకులకు శిక్ష పాడాలని పోరాడుతుంటే, నేనే ఈ హత్యకు కుట్ర చేశానని నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. ఒకవేళ నేనే హంతకురాలినైతే, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? నన్ను, నా కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయించలేదు?ఓ చెల్లిగా వచ్చి నీ ముందు నిలబడి నాకు న్యాయమని కోరితే మీరు చేసేది ఇదా?
ఓ ముఖ్యమంత్రిగానైనా వివేకా హంతకులకు శిక్షపడేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉందని మీకు తెలుసా లేదా? కానీ హంతకులను ఎందుకు వెనకేసుకొని కాపాడుతున్నారు?సాక్షి ఛైర్మన్ భారతిగారికి కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ చేతిలో పత్రిక ఉంది కదాని మాపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారు. ఒకవేళ మేమే ఈ హత్య చేశామనే సాక్ష్యాధారాలు మీ పత్రిక వద్ద ఉంటే వాటిని సీబీఐకి ఇచ్చి నిరూపించి మమ్మల్ని అరెస్ట్ చేయించవచ్చు కదా?సీబీఐ ఇస్తానన్న రూ.5 లక్షల నగదు బహుమతి కూడా తీసుకోవచ్చు కదా?మాపై బురద జల్లి తప్పించుకోవాలనే మీ ప్రయత్నం ఎన్నటికీ ఫలించడాని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.
ఇటువంటి పార్టీని విడిచి ధైర్యంగా బయటకు రావాలని వైసీపి నేతలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. హత్యా రాజకీయాలు చేసేవారిని, హంతకులను కాపాడేవారిని ఎన్నుకోవద్దని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “హత్య చేసిన వాళ్ళకు, చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు. అన్నా అని పిలిపించుకున్నవాడే నేటికీ హంతకులను కాపాడుతున్నారు. ఈ కేసు విచారణ ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో మీరే చెప్పాలి,” అంటూ నిలదీశారు.
అసలు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని వైసీపి ప్రభుత్వం ఎందుకు ఇంత గట్టిగా వెనకేసుకువస్తోంది? ఆయన మీద ఈగ వాలకుండా ఎందుకు కాపాడుతోంది? చెల్లెళ్ళమైన మాకు కొండంత అండగా నిలబడాల్సిన జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఎందుకు అండగా నిలబడుతున్నారు?అని ఇద్దరు చెల్లెమ్మల ప్రశ్నకు జగన్ సూటిగా సమాధానం చెపితే చాలు.
హంతకులు మీ పక్కనే ఉన్నారు… వారిని మీరే కాపాడుతున్నారంటూ ఎవరో కాదు… సొంత చెల్లి వేలెత్తి చూపిస్తోంది కదా? మా అన్న మళ్ళీ ముఖ్యమంత్రిని కానీయవద్దని, వైసీపిని ఓడించాలని ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకవేళ తన నిర్ణయాన్ని ఇప్పుడు గట్టిగా సమర్ధించుకున్నా రేపు ఎన్నికలలో వైసీపి ఓడిపోతే అప్పుడు ఈ కేసు విచారణ, అరెస్టులు జరగకుండా ఆపగలరా?ఆపలేకపోతే పరిస్థితి ఏమిటి?ఇదంతా చూస్తే వివేకా హత్య కేసుని ఇన్నేళ్ళు సాగదీయడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకు రావడం అంతా బెడిసికొట్టిన్నట్లే ఉంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…