
పరిపాలనా వ్యవహారాలు చూసుకోవలసిన మంత్రులు, నియోజకవర్గాలలో సమస్యలను పరిష్కరించాల్సిన వైసీపి ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రత్యేక బస్సులు వేసుకొని బయలుదేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అన్ని శాఖలకు సంబందించి నిర్ణయాలు తీసుకొంటారనే విషయం అందరికీ తెలిసిందే. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సు యాత్రలు చేసుకొన్నా బహుశః ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.
నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేకపోతునందుకు ఆర్నెల్ల క్రితమే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాలలో పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కానీ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలు చేయలేదు కనుక వారు బస్సు యాత్రలు చేసుకొన్నా ప్రభుత్వానికి, ప్రజలకు కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు.
ఐదేళ్ళు పూర్తికావస్తున్నా అమరావతి నిర్మించకుండా, విశాఖను రాజధానిగా, కర్నూలుని న్యాయరాజధానిగా చేయకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పించకుండా, కనీసం రాష్ట్రంలో రోడ్లు మరమత్తులు చేయించకుండా, తమ ప్రభుత్వం సంక్షేమ పధకాలతో ప్రజలను ఏవిదంగా ఉద్దరించిందో చెప్పుకొని మళ్ళీ తమకే ఓట్లు వేయాలని వైసీపి నేతలు బస్సులు వేసుకొని ప్రజల వద్దకు వస్తున్నారు.
గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న అనుభవం వారికి ఉంది కనుక మళ్ళీ మానసికంగా అందుకు సిద్దపడే వారు ప్రజల వద్దకు వస్తున్నారనుకోవచ్చు. వారు ప్రజలకు నచ్చజెపుతారా? ప్రజలే వారికి బుద్ధి చెపుతారా?అనేది ఎలాగూ అందరూ చూస్తారు. కనుక ఇప్పుడు దాని గురించి చర్చ అనవసరం.
కానీ ఈ బస్సు యాత్రల పుణ్యమాని వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ జిల్లాలలో దారి పొడవునా గుంతలు పడిన రోడ్లలో ప్రయాణం ఏవిదంగా ఉంటుందో స్వయంగా అనుభవించి తెలుసుకోగలుగుతారు. జిల్లాలలో ఆసుపత్రులు, పాఠశాలలు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజి, మౌలిక వసతులు ఎంత దయనీయంగా ఉన్నాయో మరోసారి కళ్ళారా చూడగలుగుతారు. వాటి గురించి ప్రజలు, మీడియా నిలదీస్తే సమాధానాలు చెప్పుకోక తప్పదు.
కనుక ఈ బస్సు యాత్రలతో వారికి జిల్లాలోని క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసొస్తాయి. సంక్షేమ పధకాలతో వైసీపికి ఓట్లు రాలుతాయో లేదో కూడా తెలిసొస్తుంది. తమ ప్రభుత్వ పాలన, పార్టీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకొంటున్నారో కూడా తెలిసొస్తుంది. కనుక ఈ బస్సు యాత్రలు వైసీపి నేతలకు కనువిప్పు కలిగిస్తాయని ఆశిద్దాం.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…