
తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న రోజున వైసీపి ప్రభుత్వం నాగార్జున సాగర్‌పైకి పోలీసులను దండయాత్రకు పంపించి ఆడించిన డ్రామాతో ఏపీ పరువు గంగలో కలిసిపోయింది. కుడివైపు గేట్లను స్వాధీనం చేసుకొని నీటిని విడుదల చేశామని మంత్రి అంబటి రాంబాబు గొప్పగా చెప్పుకోగా, దొంగచాటుగా, దౌర్జన్యంగా చేసిన ఈ పనిని ‘బాబు చేయలేనిది జగన్ చేసి చూపించారు’ అంటూ వారి ఆత్మసాక్షి గొప్పగా అభివర్ణించుకొంటూ ఓ కధనమే అల్లేసింది.
ఈ దొంగతనానికి, దౌర్జన్యానికి తెలంగాణ పోలింగ్ సమయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకోవడం చాలా తెలివైన పని నిసిగ్గుగా చెప్పుకొంది. తెలంగాణ పోలీసులు ఎన్నికల హడావుడిలో ఉండగా ఏపీ పోలీసుల సాయంతో గేట్లు తెరిపించడంతో ఆంధ్రా ప్రజలు చాలా సంతోషిస్తున్నారని గొప్పగా చెప్పుకొంది.
సున్నితమైన ఈ సమస్యని ఎటువంటి గొడవ లేకుండా జగన్ చాలా తెలివిగా పూర్తి చేశారని, కానీ టిడిపి అనుకూల ఎల్లో మీడియా దీనిని తెలంగాణ ఎన్నికలతో ముడిపెట్టి జగన్ ప్రభుత్వంపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నాయని ఆత్మసాక్షి ఆవేదన వ్యక్తం చేసింది.
జగన్ ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారంటే, గత మూడేళ్ళుగా పుష్కలంగా వర్షాలు పడుతుండటం వలన సాగునీటికి ఇబ్బంది లేనందున ఈ ఆలోచన చేయలేదని కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున జగన్ సాహసోపేతమైన ఈ నిర్ణయం తీసుకొని పల్నాడు తదితర ప్రాంతాలకు నీటిని అందించి రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్ హీరో అనిపించుకొన్నారని డప్పు కొట్టింది. జగన్ కారణంగానే రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ దుష్ప్రచారం చేసుకొని ఆనందిస్తున్న టిడిపి, జనసేనలకు, వారి ఎల్లో మీడియాను జగన్ భలే దెబ్బ కొట్టారని ఆత్మసాక్షి డప్పు కొట్టింది.
చంద్రబాబు నాయుడు చేయలేకపోయిన ఈ పనిని జగన్ అలవోకగా పరిష్కరించేశారని, ఇకపై సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా కృష్ణాబోర్డు అధీనంలో ఉండేలా జగన్ చేసి, తెలంగాణ ప్రభుత్వం పెత్తనం లేకుండా చేశారని ఆత్మసాక్షి పేర్కొంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (వేరే గత్యంతరం లేదు కనుక) సాగర్ డ్యామ్ నీటి పంపకాల విషయంలో ఏపీతో సర్దుబాటు చేసుకోక తప్పదని పేర్కొంది.
అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ముందే పసిగట్టినందునే, దాని చేతికి డ్యామ్ చిక్కకుండా కేసీఆర్, జగన్ కలిసి కుట్ర పన్నారని ఆత్మసాక్షి కధనంతోనే అర్దమవుతోంది.
తాము దొంగచాటుగా డ్యామ్ మీద దండయాత్ర చేయలేదని అంబటి రాంబాబు చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు వారి ఆత్మసాక్షే తెలంగాణ పోలీసులు బిజీగా ఉన్న సమయం చూసు డ్యామ్ మీదకు వెళ్ళామని చెప్పుకోవడమే కాకుండా నిసిగ్గుగా దానిని సమర్ధించుకొంది.
ఆంధ్రా, తెలంగాణలు భారత్-పాకిస్తాన్‌లాగా శతృదేశాలు కావు. ఒకేదేశంలో నిన్నమొన్నటి వరకు కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాలు. కనుక పొరుగు ప్రభుత్వంతో సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలా దొంగచాటుగా ప్రవేశించి దౌర్జన్యంగా గేట్లు కబ్జా చేసి నీటిని విడుదల చేసుకోవలసిన ఖర్మ ఏమిటి?
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…