
వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు, ఏపీలో షర్మిల రాజకీయ ప్రవేశం… ఇలా దేనినైనా చంద్రబాబు నాయుడు మెడలో వేసేద్దామని ఆరాటపడే వైసీపి నేతలు, విశాఖ పోర్టులో వేలకోట్లు విలువ చేసే 25,000 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడగానే ఉలిక్కిపడ్డారు.
ఎందుకంటే, వారే అధికారంలో ఉన్నారు. వారి హయాంలోనే రాష్ట్రంలో గంజాయి మూడు ప్యాకెట్లు, ఆరు బస్తాలన్నట్లు సాగుతోంది కనుక!
“విశాఖని రాజధాని చేస్తానని చెప్పి గంజాయి రాజధానిగా చేస్తారా?” అంటూ టిడిపి నేతలు నిలదీస్తుండటంతో వైసీపి నేతలు కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు టిడిపిని వెంటనే కట్టడి చేయకపోతే ఇంకా నష్టపోతామని గ్రహించేన్నట్లే ఉన్నారు.
అందుకే ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే పేర్ని నాని నేతృత్వంలో వైసీపి నేతలు మల్లాది విష్ణు, మనోహర రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు హడావుడిగా విజయవాడలోని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఈ వైజాగ్ డ్రగ్స్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.
దీని వెనుక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నారని, వారే బ్రెజిల్ నుంచి డ్రగ్స్ రప్పించి ఉండవచ్చని అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. ఈ డ్రగ్స్ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తెప్పించి ఉండవచ్చని వైసీపి నేతలు అనుమానం వ్యక్తం చేశారు. కనుక ఈ విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిపించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, దగ్గుబాటి పురందేశ్వరి ముగ్గురి ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవాలని వైసీపి నేతలు ముఖేష్ మీనాను కోరారు.
ఇలాంటి వ్యవహారంలో వైసీపి నేతలు హడావుడిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, సీబీఐ కంటే ముందే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, దగ్గుబాటి పురందేశ్వరి ఈ డ్రగ్స్ రప్పించి ఉండవచ్చని కనిపెట్టి ఫిర్యాదు చేయడం, వాటిని దేని కోసం తెప్పించారో కూడా వారే చెప్పడం చూస్తే వారిలో అభద్రతాభావం కనిపిస్తోంది.
వైసీపి ఆందోళనకు బలమైన కారణమే కనిపిస్తోంది. ఇప్పటికే గంజాయి పొగతో రాష్ట్రంలో అట్టుడికి పోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి, జనసేనలను ఉపేక్షిస్తే ఈ బురద వైసీపికే అంటుకునే ప్రమాదం ఉంటుంది.
కనుక తామే ముందుగానే ఈ బురదని టిడిపి, బీజేపీలకు అంటించేస్తే, ఇక టిడిపి, బీజేపీ, జనసేన నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలుగా తేలికగా కొట్టిపారేయవచ్చు. తిరిగి తాము కూడా వారిపై ఎదురుదాడి చేయవచ్చని వైసీపి భావించి ఉండవచ్చు.
అయినా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే ఎన్నికల సంఘాన్ని విచారణ జరపాలని కోరడం చాలా హాస్యస్పదంగా ఉందని వారికి తెలియదా?
Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…
Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…