
YSRCP's political strategies on Amaravati, three capitals, Mavigan and DSC continue to spark debate in Andhra Pradesh politics.
మన ఆశయం సరైనదైతే… దానిని సాధించే చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి ప్రయత్నమైన తప్పక నెరవేరుతుంది. తెలంగాణ సాధించాలనే ఆశయంతో బక్కప్రాణి కేసీఆర్ పోరాటం మొదలుపెడితే, ప్రజలందరూ కలిసివచ్చారు. తెలంగాణ సాధించుకున్నారు.
కానీ అదే కేసీఆర్ ‘బంగారి తెలంగాణ’ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే మళ్ళీ అదే ప్రజలు ఆయనని గద్దె దించారు.
ఆంధ్రాలో వైసీపీ కూడా నాడు సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా మొదలు నేడు డీఎస్సీ అవకతవకలంటూ అనేక పోరాటాలు చేస్తూనే ఉంది.
అయితే ఏనుగుకి పైకి కనిపించే దంతాలు వేరు, ఆహరం తినేందుకు నోట్లో ఉండే దంతాలు వేరన్నట్లు వైసీపీ మనసులో ఆలోచనలు, ఆ పేరుతో అది చేస్తున్న పోరాటాలు రెండూ వేర్వేరుగా ఉంటాయి
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల చిత్తశుద్ధి లేని శివపూజలేలయా.. అన్నట్లు మనసులో ఒక ఆలోచనలతో, పైకి వేరేగా చెపుతూ అది చేస్తున్న పోరాటాలలో నిజాయితీ, నిబద్దత లోపించింది కనుకనే ఇంతవరకు ఏ ఒక్కటీ ఫలించలేదు.
ప్రజలకు తమ రాజకీయ ఆలోచనలు అర్థం కావని, తమ పోరాటాలను చూసి ప్రభావితం అవుతారని వైసీపీ భావించడం ప్రజల విజ్ఞతపై నమ్మకం లేకపోవడం వల్లనే అనుకోవచ్చు.
వైసీపీ అధికారంలోకి రాక ముందు ‘అమరావతే రాజధాని’ అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. కానీ మాట తప్పని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నారు. వాటితోనే పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యపడుతుందని వితండవాదం చేశారు.
వైసీపీయే భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నప్పుడు తాము కోరుకున్నట్లే మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చు కదా? కానీ అటు సీమ జిల్లాలలో, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులే సభలు, ర్యాలీలు నిర్వహించారు. దేనికి?
అంటే ‘అమరావతే రాజధాని’ అంటున్న టీడీపి, జనసేనల పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచేందుకు. ఈవిషయం ప్రజలకు తెలుసు కనుకనే మూడు రాజధానుల ప్రతిపాదనని పట్టించుకోలేదు.
కనీసం ఉత్తరాంధ్రా ఓటు బ్యాంకుని చేజిక్కించుకోగలిగినా, 2024 ఎన్నికలలో మళ్ళీ గెలిచి అధికారంలోకి రాగలమని వైసీపీ భావించి ‘విశాఖ రాజధాని’ అంటూ కొత్త పాట అందుకుంది.
కానీ దానిలో కూడా వైసీపీకి చిత్తశుద్ది లేదనే విషయం ఉత్తరాంధ్ర ప్రజలు పసిగట్టారు. అందుకే కనీసం విశాఖ ప్రజలు కూడా ఆ ప్రతిపాదన పట్ల ఆసక్తి చూపలేదు.
ఇలాంటి రకరకాలా వ్యూహాలతో టీడీపి, జనసేనలను చావు దెబ్బ తీయాలనుకుంటే, వైసీపీకే ఎదురుదెబ్బలు తగిలాయి. కనుక అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా నిబద్దతతో ముందుకు సాగాలి కదా?
కానీ అలవాటులో పొరపాటు అన్నట్లు మళ్ళీ అదే పద్దతిలో మావిగన్, డీఎస్సీ అంటూ వైసీపీ రాజకీయాలు చేస్తూనే ఉంది.
నిబద్దత లేని ఇటువంటి పోరాటాలు చేస్తూ విలువైన సమయం వృధా చేసుకునే బదులు, ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడవచ్చు కదా? తమ కోసం నిజాయితీగా పోరాడే పార్టీలను, నాయకులను ప్రజలు గుర్తించగలరు. కాదని రోజుకో ప్యాలస్ వ్యూహాలతో ముందుకు సాగితే వాటితో వైసీపీ లాభాపడదు. మళ్ళీ ఎదురుదెబ్బ తగులుతుందని వైసీపీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత దానికే మంచిది.
In Tollywood, announcing a release date is one thing, sticking to it is another. Naga…
The proposed 189.93-km Amaravati Outer Ring Road (ORR) will have 17 interchanges along its six-lane,…