Telugu

టీడీపీ: గుడ్ స్టార్ట్, బట్ ఇక్కడే ఆపేస్తే లైట్!

ప్రస్తుతం ఆంధ్రదేశంలో వేడిగా వాడిగా జరుగుతున్న చర్చ, సామాజిక మాధ్యమాలే వేదికగా అసభ్యకరమైన పోస్టులు వేసిన వందలాదిమంది ప్రతిపక్ష కార్యకర్తలనబడే నేరస్తుల మీద పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు.

ఈ విషయంలో పరిణామక్రమాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుని పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంతవరకూ, 2019 కి ముందు, 2019 కి తర్వాత అని విభజించి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, అంతవరకూ చెల్లాచెదరుగా ఉన్న ఈ విషప్రచారపు వర్గాన్ని 2019లో అధికారంలోకి వచ్చినవారు బాగా గట్టిగా వ్యవస్థీకృతం చేశారు. అలా చేయడం కూడా, సలహాదారుల పేరుతో ప్రభుత్వ ఖజానా ఖర్చుతోనే చేయడం మరో పెద్ద కొసమెఱుపు. ఒక కర్మాగారంలాగా ఈ వ్యవస్థను నడిపి ప్రజల మనసుల్లో విషాన్ని నింపే ప్రయత్నం విచ్చలవిడిగా చేశారు.

ADVERTISEMENT

2019 ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ హేయ ప్రచారంతో కూడిన సినిమాలు, శ్రీరెడ్డి ఉదంతం ఇవన్నీ కూడా వైకాపా సహకారంతో జరిగినవే అని తర్వాత్తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఇవి కాకుండా నిన్నా మొన్నా పట్టుబడిన ఇంటూరి రవికిరణ్, వర్రా రవీందర్ రెడ్డిల వాంగ్మూలాలు పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, పెద్దగా కష్టపడకుండా వచ్చే డబ్బుకు ఆశపడే ఎంతోమంది యువతను వైకాపా సామాజిక మాధ్యమాల వ్యవస్థ ఆకర్షించి, స్థాయిలో పెద్దా చిన్నా తేడా లేకుండా ఎంతోమంది వ్యక్తిత్వ హననానికి వారిచేత పాల్పడింది అని.

అలాగే సినిమారంగంలోని వారిని కూడా పెద్ద ఎత్తున ఈ విషప్రచారానికి వాడుకున్న విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు. నటులు ఆలీ, పృథ్వీ, పోసాని, శ్రీరెడ్డి లాంటి చిన్నాచితకా ఎంతోమంది చేత ప్రెస్ మీట్లు పెట్టించి తెలుగుదేశం, జనసేన నాయకులమీద, వారి కుటుంబసభ్యుల మీద, ఆడా మగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఘోరంగా మాట్లాడించారు. వీటన్నింటిమీదా అప్పట్లో అతి కష్టం మీద కొన్ని కేసులు నమోదైనా కూడా పాలకపక్షం ప్రాపకం వల్ల, స్వతంత్రించి పనిచేయలేని పోలీసు యంత్రాంగం వల్ల అవి దుమ్ముకొట్టుకుని పోయాయి. వాటన్నింటినీ ఇప్పుడు బూజు దులపవలసిన సమయం ఆసన్నమైంది. రామ్ గోపాల్ వర్మమీద కేసు నమోదైంది. పోసాని మీద ఎప్పుడో నమోదైన కేసుకు ఇప్పుడు ప్రాణం పోస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ మూక అంతా ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవడం, శ్రీరెడ్డి ఒక మొక్కుబడి వీడియోలో పేరుపేరునా క్షమాపణ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా వారి గత చర్యల పర్యవసానాలను తప్పించగలవని ఏమీ గ్యారంటీ లేదు. తాజాగా సజ్జల కుమారుడు భార్గవరెడ్డి తదితరుల మీద కూడా పలు కేసులతో పాటుగా లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

ఇపుడు మొదలైన ఈ యుద్ధం కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా జరిగిన విష ప్రచారానికే పరిమితం మాత్రం కారాదు. కనీస సౌకర్యాలు అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్రవేసి చంపేయడమూ, అక్క మీద జరిగిన అఘాయిత్యాన్ని ప్రశ్నించిన అమర్‌నాథ్ ను సజీవ దహనం చేసి చంపేయడమూ, మాచర్ల దమనకాండలూ, పెద్దిరెడ్డి దారుణాలూ, కేతిరెడ్డి అక్రమాలూ, ధర్మారెడ్డి అధర్మాలూ, ద్వారంపూడి బియ్యం తరలింపులూ, బొత్స లంచావతారాలూ, కాటసాని దౌర్జన్యాలూ, ఇలా ఒకటేమిటి ? ప్రతీ జిల్లాలోనూ భారీ ఎత్తున జరిగిన మోసాలు, దోపిడీలు, అక్రమాలు, హత్యలు లెక్కలేనన్ని ఉన్నాయి.

వీటన్నింటి మీదా కూడా ఒక క్రమ పద్ధతిలో, ప్రాధాన్యతలు నిర్థారించుకుని, ఆధారాలు సేకరించుకుని, నిందితులు ఏ విధంగానూ మళ్ళీ ఎలాంటి లొసుగులతోనూ తప్పించుకునే దారి లేకుండా చేసి మరీ తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాదు, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకోవాలనే ఆలోచన చేస్తున్న కారణంగా, తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, పచ్చి బూతులతో పోస్టులు పెట్టిన తెరాస మద్దతుదారులను కూడా ఉపేక్షించకూడదు. తగిన ఆధారాలున్నచోట వారిని కూడా కఠినంగా శిక్షించాల్సిందే.

ఇలా చట్టాలను, ఆ నియమనిబంధనలను సవ్యంగా, ఒక పద్ధతిలో అమలు చేయాల్సిన అగత్యం కలిగినప్పుడు మాత్రం ఈ చెడుదారి పట్టిన వేలాదిమంది యువత భవితవ్యానికి ఎవరూ కాపు కాయలేరు, వారిని ఎవరైనా బింకంగా పైకి సమర్థించినా, క్షేత్రస్థాయిలో వారికి ఎవరైనా సరే చేయగలిగే సహాయం ఏమీ అంటే ఏమీ ఉండదు. ఆ విషయాన్ని అలా విషప్రచారపు మత్తులో జోగుతున్న సదరు యువత గ్రహించాలి. కొత్తగా తయారైన భారతీయ న్యాయ సంహితలో ఉన్న నియమాల ప్రకారం ఇటువంటి విష ప్రచారాలకు, వ్యక్తిత్వ హననానికి, చాలా కఠినమైన శిక్షలు, లక్షలకొద్దీ జరిమానాలూ ఉన్నాయి. 2019-24 మధ్యకాలంలోని ప్రభుత్వం, దాన్ని నడిపించిన పార్టీ తమ అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేసి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వేలాదిమంది యువతను మత్తు పదార్థాలకు, కల్తీ మద్యానికి, దురలవాట్లకు బానిసలను చేసి తమ లక్ష్యాలను వారిచేత సాధించుకోవడానికి వారిని ఎలా తప్పుదోవ పట్టించారో అందరమూ కళ్ళారా చూశాం. దానికి ప్రతిఫలంగా ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్షస్థానం కూడా దక్కకుండా చేసి విసిరికొట్టిన విషయం కూడా అంతకంటే గట్టిగా చూశాం.

ఇప్పుడు, వారి వలన అనేకమైన కష్టనష్టాలు పడి ప్రజల తీర్పుతో మళ్ళీ అధికారంలోకి వచ్చినది కూడా ఒక రాజకీయపార్టీనే అయినా కూడా, ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు చట్టాన్ని, న్యాయాన్ని సరైన క్రమపద్ధతిలో వాడాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలు మన కంటి ఎదురుగా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. నిజంగా రాబోయే నాలుగున్నరేళ్ళూ కూడా ఇంతే గట్టిగా, నిక్కచ్చిగా పాలకపక్షం వ్యవహరిస్తే, ఎంతమంది నరరూప రాక్షసులను జైల్లో తోయాలో లెక్క రాయడానికి, లెక్కలు తీయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నా కూడా అతిశయోక్తి కాదు. అదే జరిగితే, ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో, తమ తప్పు ఏమాత్రమూ లేకుండా ఎన్ని వ్యక్తిత్వాలు సర్వనాశనమవుతాయో ఊహకు కూడా అందకుండా ఉంది.

కాబట్టి, గతం గతం.. జరిగిందేదో జరిగింది.. ఇప్పుడు దాన్ని ఎలాగూ తిరగరాయలేం. యువత, వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా మేలుకుని తాము నడుస్తున్న దారి, వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని ఇకనైనా గుర్తించి, వారి శక్తియుక్తులను సరైన విధంగా వాడుకుని, ఉద్వేగానికీ ఉన్మాదానికీ ఉన్న తేడాను గుర్తించి నడుచుకుంటే వారి భవిష్యత్తుకు వారు మేలు చేసుకున్నవారౌతారు. సమాజానికి మరెంతో మేలు చేసినవారౌతారు.

ప్రభుత్వం తరపునుంచి చూస్తే, చంద్రబాబు గారు పదే పదే చెప్పే అభివృద్ధి మంత్రం ఎంత అవసరమో, ఆ అభివృద్ధిని పదే పదే అడ్డుకుని విష ప్రచారం చేసే తోడేళ్ళను, అన్న సరిగా పంపకాలు చేయలేదని రోడ్డుమీదకెక్కిన కుటుంబసభ్యులనబడుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడ దూకేయగల గుంటనక్కలను, వీటన్నింటినీ కూడా సరైన ప్రణాళికతో అదుపులో పెట్టవలసిన అవసరమే కాదు, ఒక రకంగా అంతం చేయవలసిన అవసరం కూడా అంతే ఉంది. ప్రస్తుతం కూటమిలో ముఖ్యపక్షంగా అధికారం చెలాయిస్తూ, కేంద్రంలో కూడా అన్ని రకాలుగానూ తన పలుకుబడిని నిరూపించుకుంటున్న తెలుగుదేశం పార్టీ, జగన్ కేసుల విషయంలోనూ, రఘురామ కృష్ణంరాజు మీద జరిగిన అఘాయిత్యం విషయంలోనూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తగినంత వత్తిడి తెచ్చి, ఆ కేసుల విచారణ వేగవంతం చేయించాలి.

అంతిమంగా, ఈ హడావిడి అంతా తాత్కాలికం కాదనీ, పైన భాజపా నుంచి కానీ, ఇక్కడ జనసేనలోనూ, తెలుగుదేశంలోనూ ఇబ్బడిముబ్బడిగా చేరుతున్న, చేర్చుకుంటున్న వైకాపా ఫిరాయింపుదారుల నుండి కానీ ఎలాంటి వత్తిళ్ళకూ లొంగకుండా నిజంగా లక్ష్యం నెరవేరేవరకూ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలగా వ్యవహరించాలనీ ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

1 hour ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

2 hours ago