
నేడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలు సమర్పించి లొంగి పోయారు. ఒకప్పుడు వృదాప్యం, అనారోగ్యం తదితర సమస్యలతో అడపాదడపా మావోయిస్టులు లొంగిపోతుండేవారు.
కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశవ్యాప్తంగా అడవులలో దాగి ఉన్న మావోయిస్టులను ఏరివేస్తుండటంతో ప్రాణభయంతో పలువురు అగ్రనేతలతో సహా వేలాదిమంది మావోయిస్ట్ వరుసగా లొంగిపోతున్నారు.
మార్చి నెలాఖరుకల్లా దేశంలో మావోయిస్టులు ఉండరని ఏడాది క్రితం ఈ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడే చెప్పారు. కనుక మర్యాదగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, వారి పునరావాసం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయపదతాయని భరోసా ఇచ్చారు.
కాదని మొండిగా పోరాడాలనుకుంటే ఎవరూ ప్రాణాలతో మిగలరని అమిత్ షా ముందే హెచ్చరించారు. చెప్పినట్లుగానే సాయుధ దళాలతో పోరాడిన ప్రతీ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. కనుక మావోయిస్టులు ప్రాణ భయంతోనే లొంగిపోయారనేది సుస్పష్టం.
కొందరు అగ్రనేతలు లొంగిపోయినప్పుడు తమ వైఫల్యానికి బూజు పట్టిన మావోయిస్ట్ సిద్ధాంతాలు పట్టుకు వ్రేలాడటం, అణచివేతకు గురవుతున్న నిరుపేద ప్రజల కోసం పోరాటాలు మొదలుపెట్టి, క్రమంగా ఆ లక్ష్యానికి దూరమవడం, పార్టీ సిద్ధాంతాల కంటే ఆయుధాలనే నమ్ముకోవడం వంటి అనేక సమస్యలను ఏకరువు పెట్టారు.
మావోయిస్టులు తమ తప్పులు, వైఫల్యాలకు కారణాలు వారే చెప్పుకున్నారు కనుక మళ్ళీ ఆ చర్చ అనవసరం.
ఏది ఏమైనప్పటికీ దాదాపు అందరూ లొంగిపోయారు. వారిలో కొందరు అగ్రనేతలు ప్రజాస్వామ్యబద్దంగా పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతామని చెపుతున్నారు. ఇదీ మంచి ఆలోచనే.
కానీ ఇంతకాలం దేశంలో అడవులలో చాలా వరకు మావోయిస్టుల వలననే కాపాడబడ్డాయి. చీమలున్న పుట్టలోకి పాములు ప్రవేశించనట్లే, దట్టమైన అడవుల జోలికి రాజకీయ నాయకులు, కార్పోరేట్ కంపెనీలు ప్రవేశించలేదు.
కానీ ఇప్పుడు అడవులలో వాళ్ళు లేరు. అడవులు, వాటిలో పారే సెలయేర్లు, జంతువులు, పక్షులు మాత్రమే మిగిలాయి. వాటికి ఎవరినీ అడ్డుకోగల శక్తి లేదు.
కనుక మావోయిస్టులను ఏరివేయడంపై చూపిన శ్రద్ధ అడవులను, వాటిలో జంతువులు, పక్షులను కాపాడుకోవడంపై కూడా ప్రభుత్వాలు చూపాల్సిన అవసరం ఉంది.
మరీ ముఖ్యంగా మన రాజకీయ నాయకులు, వారి బంధుమిత్రులు, అసమదీయ కార్పోరేట్ కంపెనీలకు వాటిని దోచి పెట్టకుండా ఉండాలి. దేశంలో నివాస యోగ్యమైన భూభాగం, మట్టి, కంకర, ఇసుక కోసం కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ తవ్వేసి ఎత్తుకుపోయిన వారి ఇప్పుడు అప్పనంగా కనిపిస్తున్న అడవులను, జంతువులను, పక్షులను విడిచిపెట్టరు కనుక!
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…