‘దేశం విడిచి ఎక్కడికైనా వెళదామని నా భార్య చెప్పింది’ అన్న ఒకే ఒక్క వ్యాఖ్యం బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ను చిక్కుల్లో పడేసింది. అలాగే ఏకంగా ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ హోదాను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే దీనిపై సోమవారంనాడు ముంబైలో సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో… అసలు తాను చేసిన వ్యాఖ్యలు, వాటి భావన, దానిని జనం అర్థం చేసుకున్న తీరు తదితర అంశాలపై వివరణ ఇచ్చుకున్నారు.
‘‘భారత్ అసహన దేశమని నేనెప్పుడూ అనలేదు. దేశం విడిచి వెళతానని కూడా అనలేదు. ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందులో మీడియా తప్పు కూడా ఉంది. భావోద్వేగాలు దెబ్బతిన్నవారి ఆవేదనను అర్థం చేసుకోగలను. నేనిక్కడే పుట్టాను. ఇక్కడే చనిపోతాను. భారత్ లో ఉన్నంత వైవిధ్యం మరే దేశంలోనూ లేదు. నాకు నా దేశం అంటే చాలా ఇష్టం. విదేశాలకు వెళితే… రెండు వారాలకు మించి భారత్ ను వదిలి ఉండలేను’’ అంటూ అమీర్ సుదీర్ఘ సంజాయిషీ ఇచ్చుకున్నారు.
అయినా ఆ చిక్కుల నుంచి అమీర్ ఇప్పుడప్పుడే బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. అమీర్ ఇచ్చిన సంజాయిషీ నెటిజన్లను ఏ మాత్రం సంతృప్తిపరిచినట్లు లేదు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అతడి తాజా చిత్రం ‘దంగల్’పై బహిష్కరణ వ్యాఖ్యలు మొదలయ్యాయి. ‘బాయ్ కాట్ దంగల్’ పేరిట ట్విట్టర్ లో ప్రారంభమైన ఓ ప్రచారం హోరెత్తుతోంది. సినిమాల కోసం ఏమైనా చేయడానికి అమీర్ వెనుకాడటం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసి, “దంగల్”ను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపు ఉధృత రూపం దాల్చుకుంటోంది.





