బాలీవుడ్ నాట సినీ సెలబ్రిటీల జీవితానికి సెక్యూరిటీ కరువవుతోందన్న డేంజర్ సిగ్నల్స్ కనపడుతున్నాయి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ ఇంటిలోకి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించి సృష్టించిన గందరగోళం ముగియక ముందే, మరో విషాదకరమైన వార్త వెలుగుచూసింది. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ళ బాలీవుడ్ నటి కృతికా చౌదరి తన ఇంట్లో అంతు చిక్కని పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించింది.
ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఇరుగు, పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో… అక్కడికి వెళ్లిన పోలీసులు కృతిక మరణించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని చార్ బంగ్లా ప్రాంతంలో ఉన్న భైరవ్ నాథ్ సొసైటీలో కృతిక నివాసం ఉంటోంది. ప్రాధమిక అంచనా ప్రకారం… మూడు, నాలుగు రోజుల క్రితమే మరణించి వుండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామనిచెప్పారు.
తొలుత ఏడీఆర్ (యాక్సిటెంటల్ డెత్ రిపోర్టు) రాసినప్పటికీ, విచారణలో ఆమె హత్య చేయబడి వుండవచ్చని అనుమానించామని పోలీసు అధికారి తెలిపారు. దీంతో దీనిని హత్య కేసుగా నమోదు చేసి విచారిస్తున్నామని, పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఇందులో కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. నాడు బుల్లితెర నటిమణి ప్రత్యూష కేసు ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఇలాంటి సంఘటనలు వరుసగా నమోదు కావడం బాలీవుడ్ వర్గాలను కలవరపెడుతోంది.



