రవిబాబు దర్శకత్వం వహించే సినిమాలు మాత్రమే వెరైటీగా ఉండవు, ఆ సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడానికి చేసే ప్రమోషన్ మెటీరియల్ కూడా వినూత్నంగానే ఉంటుంది. కానీ “అదుగో” సినిమా విషయంలో ఇది భయంకరంగా మారుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ చేసిన ప్రమోషన్స్ లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
[m9ad]
తాజాగా విడుదల చేసిన “అదుగో” టైటిల్ సాంగ్ కూడా ఇదే బాటలో పయనించింది. హీరోయిన్ పూర్ణతో చిత్రీకరించిన ఈ పాట చిత్రీకరణ పరంగా ఓకే అనిపించుకున్నా, వినడానికి మాత్రం కాస్త కర్ణకఠోరంగా ఉందని చెప్పకతప్పదు. ‘అదుగో’ అన్న పదం రావాలని బలవంతంగా ఈ పాటను రచించినట్లుగా వినపడుతోంది తప్ప, ఎక్కడా సాంగ్ లో ‘అదుగో’ ఫ్లో లేదు. ఇక ‘ఈగ’తో వేసిన స్టెప్పుల మాదిరే ఈ ‘బంటి’తో చేయించడం వీక్షకులకు ఏ మాత్రం కిక్ ను పంచలేదు.
ప్రమోషన్స్ ఆకట్టుకోలేకపోవడం…. అనేక వాయిదాలు…. ఇలాంటి అవాంతరాలను దాటుకుని ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ అవుతుందా? అంటే ప్రశ్నార్ధకంగానే కనపడుతోంది. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యంత ఎక్కువ సమయాన్ని రవిబాబు కేటాయించారు గనుక, సిల్వర్ స్క్రీన్ పై ఏదొక మాయ చేస్తారన్న హోప్ ఒక్కటే, ఈ సినిమాకు శ్రీరామరక్ష!



