రాజకీయంగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే వారన్న సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ హయంలో కాంగ్రెస్ తరపున ఓ సారి ఎంపీగానూ ప్రాతినిథ్యం వహించిన కృష్ణ, ఆ తర్వాత రాజకీయాలకు దూరమై వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినపుడు వారితో సన్నిహితంగా మెలిగారు. అయితే వైయస్ మరణం తరువాత జగన్ కు దగ్గరైనట్టు కనిపించినా, కృష్ణ అల్లుడు, ప్రిన్స్ మహేష్ బాబు అమితంగా ఇష్టపడే వ్యక్తి గల్లా జయదేవ్ తో పాటు, కాంగ్రెస్ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీలో చేరిపోవడంతో, ఇక కృష్ణ ఫ్యామిలీ అంతా టీడీపీకే మద్దతుగా నిలుస్తుందని అంతా భావించారు.
అయితే మరోవైపు కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు జగన్ బాట పట్టినప్పటికీ, ఆయనకు అక్కడ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో, సూపర్ స్టార్ ఫ్యామిలీ మద్దతు టీడీపీకే ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జరిగింది. అలాగే చంద్రబాబు సమీప బంధువు కూతురితో ఇటీవల జరిగిన ఆదిశేషగిరిరావు కుమారుడి వివాహం జరగడంతో, ఈయన కూడా టీడీపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆదిశేషగిరిరావుకు వైసీపీలో కీలక పోస్టు ఇచ్చారు జగన్. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఆదిశేషగిరిరావుకు స్థానం కల్పించారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన వైసీపీకి దూరంగా ఉంటున్న ఆదిశేషగిరిరావు, జగన్ తాజా నిర్ణయంతో వైసీపీలో కొనసాగుతారా? లేక సైకిల్ ఎక్కుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో వైసీపీని వీడతారని అనుమానం వచ్చిన ప్రతివారిని ఏదొక విధంగా ఆపుతున్న జగన్, సొసైటీలో ప్రిన్స్ ఫ్యామిలీకి ఉన్న పలుకుబడి రీత్యా ఆదిశేషగిరిరావుకు పార్టీ పదవి ఇచ్చి, నియంత్రించే పని చేసారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.





