AI కనిపించే ప్రమాదమే….కానీ కట్టడి చెయ్యలేని పెనుభూతం

AI deepfake danger and digital safety risks

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్…ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు భవిష్యత్ సాంకేతికతగా భావించిన AI..నేడు మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. చదువు నుంచి ఉద్యోగాల వరకు వ్యాపారం నుంచి వినోదం వరకు ఇలా ప్రతి రంగంలోనూ తన ప్రాధాన్యతను, తన ఆధిపత్యాన్ని చూపేందుకు AI వేగంగా అడుగులేస్తోంది.

అయితే ఇక్కడే AI అంటే మనిషిలో ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందితే అది మానవజాతి మనుగడకు మరింత సౌకర్యాలను జోడిస్తుంది అనే ఆనందం కంటే కూడా మానవజాతి మనుగడను ప్రశ్నార్దకంలోకి నెడుతుంది అనే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

నిన్నటి వరకు యువత ఉపాధి ని వారి అభ్యున్నతను ఇరకాటంలో పెట్టిన AI ఇప్పుడు ఒక మహిళ భద్రత మీద కూడా అనేక అనుమానాలను సృష్టించే స్థాయికి చేరింది. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాహ్నవి కపూర్ AI వీడియో సామాన్యులనే కాదు సెలబ్రెటీలను సైతం కంగారు పెడుతుంది.

టెక్నాలజీ ని సరైన పద్దతిలో వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది నాణానికి ఒక వైపు అయితే అదే టెక్నాలజీ తో వికృత చేష్టలకు పాల్పడవచ్చనేది నాణానికి మరోకోణం. జూ. ఎన్టీఆర్, జాహ్నవి కలిసి నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ లో జాహ్నవి వీడియో లను AI తో మార్ఫింగ్ చేసి కొందరు సోషల్ మీడియా ఉన్మాదులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

దీనిపై తారక్ వెంటనే స్పందిస్తూ ఇటువంటి AI వీడియోలు పోస్ట్ చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ తన X వేదికగా ఒక పోస్ట్ చేసారు. సదరు వీడియో ను ఎవరైనా రీ పోస్ట్ చేసినా, షేర్ చేసినా వారి పై కూడా కఠిన చర్యలు తప్పవని, మహిళను గౌరవించే దేశంలో పుట్టిన మనం ఇలా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా AI వీడియోలు తయారుచేయడం, వాటిని ప్రచారంలోకి తేవడం అత్యంత హీనమైన చర్యగా అభివర్ణించారు తారక్.

మహిళ అనే కనీస సంస్కారం కూడా లేకుండా ఇలా AI ని వినియోగించి వీడియోలు తయారు చేసి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి పైశాచిక ఆనందం పొందే వారు ఒక్కసారి వారి ఇళ్లల్లోని మహిళల గురించి కాస్త ఆలోచిస్తే ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా.? నిన్న రష్మిక, నేడు జాహ్నవి, రేపు…సమాజంలో ఉన్న ఎవరైనా కావచ్చు.

ఈ రోజు బాధితురాలి లిస్ట్ లో జాహ్నవి కపూర్ ఉన్నట్టు రేపు అదే స్థానం ఒక సామాన్య గృహిణి ఉండొచ్చు, ఒక విద్యార్థి ఉండొచ్చు, లేదా మహిళల స్థానంలో పురుషులు కూడా ఇటువంటి వీడియోల బాధితులుగా మారవచ్చు. అందరు ఇటువంటి సెన్సటివ్ అంశాల మీద ఒకేలా స్పందించలేరు. కొందరు ఇటువంటి ఉన్మాద చర్యలను ధైర్యంగా ఎదిరించి పోరాడి నిలబడతారు.

కానీ అందరికి ఆ స్థాయిలో ఆత్మస్తైర్యం ఉండకపోవచ్చు. అటువంటి బలహీనమైన క్షణాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కుటుంబాలు కుటుంబాలే చేయని తప్పుకి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి వీడియోలను ప్రచారంలోకి తెస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటే కనీసం మరో వీడియో చేసే వారికీ హెచ్చరికగా ఉంటుంది. AI కంటికి కనిపించే ప్రమాదమే కానీ కట్టడి చేయలేని ఒక పెనుభూతం కానుందా..?

ADVERTISEMENT
Latest Stories