రాజా వచ్చేసాడు.. రాజ్యాధికారం బ్యాలెన్స్..!

Rohit Sharma Back as Mumbai Indians Captain for IPL 2027

గడిచిన రెండు మూడు నెలలుగా అభిమానులు ఊహిస్తున్నదానినే నేడు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. తమ 5 టైమ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్, మాజీ భారత కెప్టెన్, ‘ది హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మను వచ్చే ఐపీఎల్ సీజన్ 2027కు ముంబై జట్టు సారథిగా ప్రకటించింది.

2023 నవంబర్ 27న అప్పటి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు ట్రేడ్ రూపంలో తమ జట్టులోకి తీసుకుని, కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మ నుంచి పాండ్యాకు అప్పగించింది. ఆనాటి నుంచి నేటి వరకు ముంబై జట్టు మునుపెన్నడూ చూడని ఎన్నో సంఘటనలను చూడక తప్పలేదు.

ADVERTISEMENT

తొలుత, 2024 సీజన్‌లో అభిమానులు పాండ్యాకు వ్యతిరేకంగా మారి, ప్రతి హోమ్ మ్యాచ్‌లోనూ అతడిని గేలి చేస్తూనే వచ్చారు. నెమ్మదిగా అభిమానులు పాండ్యాను అంగీకరించినప్పటికీ, జట్టు ప్రదర్శనలో మాత్రం పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ప్రతి సీజన్‌లోనూ అద్భుతమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగినప్పటికీ, ప్రతిసారీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

అయితే, 2026 సీజన్ జరుగుతున్న సమయంలోనే వచ్చే సీజన్‌లో పాండ్యా ముంబై జట్టులో ఉండబోడనే వార్తలు వైరల్ అయ్యాయి. తొలుత అవన్నీ ఫేక్ వార్తలని భావించినప్పటికీ, చివరికి అదే నిజమైంది. పాండ్యాను పంజాబ్‌కు ట్రేడ్ చేసి, బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై మేనేజ్‌మెంట్.

అయితే, అభిమానులు ముద్దుగా ‘ముంబై చా రాజా’ అని పిలుచుకునే 5 టైమ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. ఏ రోజునైతే అతడి నుంచి కెప్టెన్సీ బాధ్యతలను వెనక్కి తీసుకున్నారో, తిరిగి అదే రోజున రోహిత్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది ముంబై ఇండియన్స్.

గత రెండు మూడు సీజన్లుగా ముంబై వైఫల్యానికి అనలిస్టులు, క్రికెట్ పండితులు తరచుగా చెబుతున్న కారణం ఏమిటంటే.. సమస్య స్క్వాడ్‌లోనో, మేనేజ్‌మెంట్‌లోనో లేదు. అనేక మంది అంతర్జాతీయ దిగ్గజ ఆటగాళ్లను సమర్ధవంతంగా నడిపించలేకపోవడం పాండ్యాకు అతిపెద్ద సవాలుగా మారింది.

గతంలో గుజరాత్‌కు సారథిగా ఉన్నప్పుడు జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నప్పటికీ, పాండ్యా ఆ జట్టును అద్భుతంగా తీర్చిదిద్ది మంచి ఫలితాలను అందించగలిగాడు. సారధిగా వ్యవహరించిన రెండు సీజన్లలో ఒక ట్రోఫీ, మరియు మరొకసారి జట్టును ఫైనల్ వరుకు చేర్చి, ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో చేజార్చుకున్నారు.

అయితే, రోహిత్ తిరిగి కెప్టెన్ కావడంతో ముంబై అభిమానుల ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి. చివరిగా 2020లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు, కప్పును ముద్దాడి అప్పటికే ఆరేళ్లు గడిచిపోయాయి. గతంలో 2013, 2015, 2017, 2019 వంటి బేసి సంవత్సరాల్లో కప్పుపై ఆధిపత్యం చెలాయించిన ఆ ఫ్రాంచైజీ, మళ్లీ 2027 సీజన్‌ను డామినేట్ చేస్తుందా?

ADVERTISEMENT
Latest Stories