భారత రాజకీయాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ చర్చ మరోసారి వేడెక్కింది. లోక్సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్లు, ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు ఈ చర్చలో కీలకంగా మారాయి. ముఖ్యంగా డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందా? డీలిమిటేషన్ ఎవరి అధికారాన్ని ‘లిమిట్’ చేయనుంది? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలు డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య, వాటి సరిహద్దులను పునర్విభజించడం. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉండగా, వీటిని 50 శాతం పెంచి సుమారు 816కు తీసుకెళ్లాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించాలనే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఉంది.
అందుకే సీట్ల పెంపుతో పాటు రాష్ట్రాల మధ్య ప్రస్తుత నిష్పత్తిని కొనసాగించాలనే ప్రతిపాదన కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తమినాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్ లోక్సభ సీట్లు పెంచితే తమినాడుకు ఉన్న 7.18% షేర్ తగ్గకూడదని, అలాగే రాష్ట్రాలకు 1971 సెన్సస్ ప్రకారం ఉన్న పార్లమెంట్ ప్రాతినిధ్యాన్ని మరో 25 ఏళ్ళు అలానే ఉంచాలనే డిమాండ్లను తెరమీదకు తెచ్చారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ రాష్ట్రానికి మంచి అవకాశమని, దీని ద్వారా రాష్ట్రంలో లోక్ సభ స్థానాల సంఖ్య 50% వరకు పెంరిగే అవకాశం ఉంటుందంటూ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక వైసీపీ కూడా బీజేపీ నిర్ణయానికి తలవగ్గక తప్పలేదు. డీలిమిటేషన్ కు మా పార్టీ మద్దతు ఉంటుందంటూ వైఎస్ జగన్ ప్రకటించడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలిచినట్టయ్యింది.
మరోవైపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కూడా డీలిమిటేషన్ కీలకం. 2023లోనే మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందినప్పటికీ, జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమలులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అయితే ఈ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించాల్సి ఉంది. రాజ్యాంగ సవరణకు ప్రత్యేక మెజారిటీ అవసరం కావడంతో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కీలకం కానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది.
మరి డీలిమిటేషన్ దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపనుందా? సీట్ల పెంపుతో ఎవరి రాజకీయ బలం పెరుగుతుంది? దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఎలాంటి భరోసా లభిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో ఈ బిల్లు చట్టసభలకు వెళ్లినా కొన్ని రాజకీయ కారణాలతో వెనక్కి వచ్చింది.
ఈసారి ఈ బిల్లు ఆమోదం అనేది ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో డీలిమిటేషన్ పై దేశ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




