అల్లు అర్జున్‌ని వదలట్లేదు… ఎందుకో?

Allu Arjun political rumours

పుష్ప-2లో హీరో అల్లు అర్జున్‌ ముఖ్యమంత్రిని మార్చే అంత స్థాయికి ఎదిగినట్లు చూపారు. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ 24 గంటలు జైల్లో గడపాల్సి వచ్చింది. సినిమాకి, నిజ జీవితానికి ఇదే తేడా!

ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా సోషల్ మీడియాలో రోజుకో కొత్త పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ అల్లు అర్జున్‌ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని రాజకీయాలలోకి రాబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలే.

ADVERTISEMENT

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సినిమాలకు గుడ్ బై చెప్పి టీవీకే పార్టీతో రాజకీయాలలో ప్రవేశించి తొలి దశ ప్రయత్నంలోనే తమిళనాడు సిఎం అయ్యారు. ఆయన స్పూర్తితో అల్లు అర్జున్‌ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారని రెండు రోజులుగా జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఆయనని రాజకీయాలలో రప్పించేందుకు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారని, అల్లు అర్జున్‌ అంగీకరిస్తే పార్టీ ఏర్పాట్లు, పార్టీ కోసం ఓ న్యూస్ ఛానల్‌ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ మరో పదేళ్ళ తర్వాత జరిగే ఎన్నికలతో రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని ఈ పుకార్లు పుట్టించినవారే ముహూర్తం కూడా ప్రకటించారు.

సినిమాలో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినప్పటికీ పదవి, అధికారం ఉన్నవారి ముందు తల వంచక తప్పదని సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అల్లు అర్జున్‌ అర్ధమైందని, కనుక అయన రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటున్నారని, ఈ పుకార్లు పుట్టిస్తున్న సదరు అదృశ్య వ్యక్తులు ఓ కారణం కూడా జోడించారు.

ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ వైసీపీలో తన స్నేహితుడు శిల్పా రెడ్డి కోసం నంద్యాలకు వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. కనుక అల్లు అర్జున్‌కి రాజకీయ ఆలోచనలు ఉండి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సినీ పరిశ్రమలో ఈ స్థాయికి ఎదిగినవారు రాజకీయాలపై ఆసక్తి పెంచుకోవడం పెద్ద విచిత్రం కాదు. కానీ ఎంత గొప్ప ఇమేజ్ ఉన్నా రాజకీయాలలో ప్రవేశిస్తే ప్రజలు తప్పక ఆదరిస్తారనే గ్యారెంటీ ఏమీ లేదని చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగంతో స్పష్టమైంది. ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్‌ కూడా చాలా ఎదురుదెబ్బలు తిన్నారు. కానీ తట్టుకొని నిలబడటం వలన నేడు ఈ స్థాయికి చేరుకోగలిగారు.

కానీ అల్లు అర్జున్‌కి ఆవిధంగా ఆటుపోట్లు తట్టుకొని నిలబడి పోరాడాల్సిన పరిస్థితి, అవసరం రెండూ లేవు.

ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అటువంటి పరిస్థితి లేదు.

మరెందుకీ పుకార్లు అంటే అధికార పార్టీలో ఆందోళన, ప్రజలలో గందరగోళం సృష్టించేందుకే అని భావించాల్సి ఉంటుంది. ఈ పుకార్లకు అల్లు అర్జున్‌ స్వయంగా చెక్ పెడితే మంచిది. లేకుంటే ఆయనకీ ఇవి కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories