సినీ ఇండస్ట్రీలో ‘సెంటిమెంట్’ అన్న పదానికి ఎవరూ అతీతులు కాదు. ప్రతి హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకుడు… ఇలా ప్రతి ఒక్కరికి ఏదొక సెంటిమెంట్ ఉండి తీరాల్సిందే. అయితే కొంతవరకు విశ్వసిస్తే పర్వాలేదు గానీ, ఈ సెంటిమెంట్ ఎక్కువైతేనే… చివరికి అది తలకు ‘ఆయింట్మెంట్’ రాసుకునే వరకు దారితీస్తుంది. గతంలో, వర్తమానంలో చాలా మంది హీరోలు ఇలాంటి అనుభూతులనే చవిచూసారు.
ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలకు మూడక్షరాల సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది. అయితే ‘అర్జున్, అతిథి, ఖలేజా’ వంటి సినిమాల ఫలితాలు ఆ సెంటిమెంట్ ను దూరం చేసాయి. అలాగే పవన్ కళ్యాణ్ కు ‘బ్లాక్ బస్టర్’ అంటే ఒక్క సమ్మర్లోనే వస్తుందన్న సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. దాన్ని ‘అత్తారింటికి దారేది’ బ్రేక్ చేయగా, ఇటీవల సమ్మర్లో విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఫలితం తర్వాత సమ్మర్లో బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు, భారీ డిజాస్టర్లు కూడా చవిచూస్తాయని నిరూపణ అయ్యింది.
ఇలా ప్రతి హీరో మాదిరే అల్లు అర్జున్ కూడా గత మూడు సంవత్సరాలుగా ఒక సెంటిమెంట్ ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారని చెప్పవచ్చు. వరుసగా మూడేళ్ళల్లో సమ్మర్లో విడుదలైన ‘రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’ మూడు సినిమాలలో రెండు బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకోగా, ఒకటి యావరేజ్ మార్క్ తో సరిపెట్టుకుంది. దీంతో తనకు బాగా అచ్చివచ్చిన సమ్మర్ సెంటిమెంట్ నే మరోసారి రిపీట్ చేయబోతున్నాడు బన్నీ.
హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఒక అధికారిక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేసారు. ఆగష్టులో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఖచ్చితంగా బన్నీ సమ్మర్ సెంటిమెంట్ ప్రకారమే షెడ్యూల్స్ ప్లాన్ చేసారని స్పష్టమవుతోంది. సక్సెస్ లు వచ్చినంత వరకు ఎలాంటి ‘సెంటిమెంట్’లు ఫాలో అయినా ప్రేక్షకులు అంగీకరిస్తారు, ఒకవేళ అదే సెంటిమెంట్ బెడిసికొడితే… మరీ ఓవర్ చేస్తున్నారని అదే ప్రేక్షకులు తిప్పికొడతారు… దీన్ని కూడా బన్నీ దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందేమో..!



