కుల రాజకీయాలు చేసుకుంటూ వైసీపీ అధినేత ‘జగన్ అండ్ కో’ పబ్బం గడుపుకుంటున్నారని తాజా పరిణామాలతో పొలిటికల్ వర్గాలతో పాటు సామాన్య ప్రజలలోనూ ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ముద్రగడ దీక్షను, కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయం చేసిన వైనంపై జగన్ మరియు ఆయన మీడియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇందులో జగన్ కు అత్యంత సానుకూలమైన విషయం ఏమిటంటే… ఈ కుల రొచ్చులోకి కాంగ్రెస్ పార్టీని మరియు కాపు వర్గం హీరో, నేత అయిన చిరంజీవిని కూడా లాగి, మరో పార్టీకి కూడా రాజకీయ లబ్ధి చేకూరకుండా చేయడంలో విజయవంతమయ్యారు.
అయితే ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కుల రాజకీయాలకు దూరంగా వ్యవహరించడంతో రాజకీయ విశ్లేషకుల నుండి, విజ్ఞుల నుండి పవన్ పై ప్రశంసలు కురిసాయి. బహుశా ఇది వైసీపీ వర్గానికి నచ్చలేదో ఏమో గానీ, తాజాగా మరోసారి అంబటి రాంబాబు ద్వారా పవన్ ను ఈ రొచ్చులోకి లాగాలని తీవ్ర ప్రయత్నం చేసినట్లుగా కనపడుతోంది. ‘తానూ చెడ్డ కోతి… వనమంతా చెరిచిందని…’ అన్నట్లు కులాల కంపులాటలో రాజకీయం చేసుకుంటున్న వైసీపీ, తనతో పాటు మిగిలిన వారిని కూడా అదే తరహా రాజకీయాలు చేయాలని ఒత్తిడి చేయడం విశేషం.
తాజాగా ఓ మీడియా ఛానల్ చర్చలో పాల్గొన్న వైసీపీ నేత అంబటి రాంబాబు, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. “ప్రస్తుత తరుణంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడమనేది సమాజంలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిందని, గత ఎన్నికల్లో కాపు సమాజం చంద్రబాబుకు ఓటు వేసేందుకు గట్టిగా కృషి చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఆయన వల్లనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని, అలాంటి పవన్ కల్యాణ్ నోరు విప్పకపోవడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, దీనికి తాను కూడా మద్దతు పలుకుతున్నానని” పవర్ స్టార్ పై ఒత్తిడి తెచ్చే వ్యాఖ్యలు చేసారు.
“ఒక కులాన్ని సపోర్ట్ చేస్తే బహుశా కుల ముద్ర పడిపోతుందని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారేమోనని తనకు అనుమానంగా ఉందని… అయినా పవన్ కల్యాణ్ గారు… నీ కులానికి ప్రమాదం వచ్చినప్పుడైనా మీరు మాట్లాడకుండా ఉంటే తప్పవుతుందని, సమాజంలో తన కులానికి, తన కుటుంబానికి, తన వర్గానికి, తన రాష్ట్రానికి, తన రాష్ట్రానికి ప్రమాదం వచ్చినప్పుడు స్పందించకపోతే తప్పవుతుందనే విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ గారు గమనించాలని, ముద్రగడ నిరాహార దీక్ష పట్ల పోలీసులు బలగాలు ప్రవర్తిస్తున్న తీరును ఖండించాల్సిన అవశ్యకత మాత్రం పవన్ కల్యాణ్ గారిపై మరింత ఎక్కువగా ఉందని… బహుశా తర్వాతైనా తన స్పందనను పవన్ వ్యక్తపరుస్తారని తానూ ఆశిస్తున్నాను” అంటూ ముగించారు అంబటి.
అయితే వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఈనాటివి కావు. కాపు కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా పవన్ పేరును ప్రస్తావించడం, పవన్ మాత్రం వీటికి దూరంగా ఉండడం జరుగుతూ వస్తున్న విషయమే. అయితే ముద్రగడ దీక్ష చివరి దశకు చేరుకోవడంతో… పవన్ స్పందిస్తారేమోనని ముందు కాళ్ళకు బంధం వేసేలా అంబటి వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.



