జగన్ రాజకీయ జీవితం ఒక మొదలైంది “ఓదార్పు” అనే పదంతోనే. తన తండ్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత చిగురించిన ముఖ్యమంత్రి కావాలనే ఆశతో కాంగ్రెస్ అధిష్టానానికి ప్రజలలో తనకున్న పలుకుబడిని నిరూపించుకోవడo కోసం ప్ర్రజల వద్దకు వెళ్ళడానికి “ఓదార్పు యాత్ర” పేరుతో ఒక అవకాశాన్ని సృష్టించుకున్నారు.
తన ఓటు బ్యాంకింగ్ కోసం అప్పట్లో జగన్ చాలా మంది ప్రజలను ఓదార్చారు కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జగన్ ను ఓదార్చే ప్రక్రియ చేయలేదు. అయినా ఈ ‘ఓదార్పు’ కోసమే కాంగ్రెస్ పార్టీ వీడి కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తన ‘ఓదార్పు’ యాత్రకు ఎటువంటి అడ్డంకులు రాకుoడా చూసుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరువాత పోటీ చేసిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన సాధించిన విజయాన్ని చూసి ఆయన కార్యకర్తలే కాదు, రెండు రాష్ట్రాల ప్రజల ఓదార్పు జగన్ కు అవసరమైంది.
ఒకసారి ఓదార్చడం – మరోసారి ఓదార్పు కోరుకోవడం జగన్ కు అలవాటుగా మారిపోయిందని రాజకీయ పెద్దల విశ్లేషణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా ఒక వైపు తన ఎమ్మెల్యేలను జగన్ ఓదార్చడం, మరో వైపు తనను ఓదార్చే వారి కోసం ఆశగా చూడడం జగన్ వంతవుతోందన్న చలోక్తులు వినపడుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కారు. మరికొంతమంది ‘పసుపు’ కండువా వేసుకుని ‘సైకిల్’పై తిరగడానికి సిద్దంగా ఉన్నారనే సమాచారంతో జాగ్రత్తపడిన జగన్ మిగిలిన నేతలనైనా కాపాడుకోవాలని వారిని ఓదార్చి బుజ్జగిస్తున్నారు. అదే సమయంలో తనను కూడా ఎవ్వరైనా ఓదారిస్తే బాగుంటుందని జగన్ ఆశపడుతున్నారని ఆయన పార్టీ నేతలే అభిప్రాయ పడుతున్నారు.
ఈ విధంగా ఒక్క “ఓదార్పు” అనే పదం జగన్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని బహుశా ఆయన కూడా ఉహిoచి ఉoడరేమో! ఈ విధంగా రాజకీయ అవసరాల కోసం ఓదార్పు ఇవ్వడం, ఓదార్పు కోరుకోవడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుoదోనని, భవిష్యత్తు రాజకీయ నాయకులకు జగన్ “ఓదార్పు యాత్ర” అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



