tollywood-hema-committee

సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని పలు సందర్భాలలో బయటపడుతూనే ఉంది. కనుక కేరళ జస్టిస్ హేమ కమిటీ తరహాలో టాలీవుడ్‌లో కూడా విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీ వేయాలని నటి సమంత నాలుగైదు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశారు.

ఆమె హేమ కమిటీని దృష్టిలో ఉంచుకొని అప్పుడు ఆ విజ్ఞప్తి చేసిన్నట్లు అనిపించినప్పటికీ, ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం బయటకు పొక్కిన తర్వాత, సమంతకి ఈ విషయం ముందే తెలిసి కమిటీని ఏర్పాటు చేయమని అడిగారా? అనే సందేహం కలుగుతుంది.

Also Read – వింటేజ్ విరాట్…!

ఏది ఏమైనప్పటికీ జానీ మాస్టర్ వ్యవహారం బయటకు పొక్కింది కనుక ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతున్న ఇటువంటి అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ వ్యవహారాన్ని ఇంతకాలం గుట్టుగా దాచిపెట్టిన టాలీవుడ్‌ పెద్దలు, ఇప్పుడు సీనియర్ నటి ఝాన్సీ చేత వరుసగా ప్రెస్‌మీట్‌లు పెట్టించి, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఓ పెద్ద హీరో బాధితురాలికి అండగా నిలబడ్డారని, జానీ మాస్టర్‌ తప్పు చేసినట్లు భావిస్తున్నామని చెప్పిస్తున్నారు.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

ఒకవేళ ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరకపోయి ఉంటే ఇలా ప్రెస్‌మీట్‌ పెట్టి జానీ మాస్టర్ తప్పు చేశాడని చెప్పేవారా? అంటే కాదనే అర్దమవుతోంది.

అయితే నేడు ప్రెస్‌మీట్‌లో ఝాన్సీ మాట్లాడుతూ మీడియాకు సుద్దులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సున్నితమైన ఇటువంటి కేసులలో బాధితురాలి పేరు, ఫోటో ప్రచురించకూడదనే మార్గదర్శకాలను పట్టించుకోకుండా ‘హాట్ న్యూస్’ కోసం ప్రచురించేశారని ఝాన్సీ తప్పు పట్టారు.

Also Read – అందరి చూపు, నాని HIT వైపే

మీడియాకు కావాలంటే మా దగ్గర మార్గదర్శకాలున్నాయని ఇస్తామని ఝాన్సీ అన్నారు. నిజమే మీడియాలో పోటీ, ఒత్తిడి, రాజకీయాలు పెరిగిపోయినందున కొందరు ఝాన్సీ చెప్పిన్నట్లు హాట్ న్యూస్ కోసం మార్గదర్శకాలను పట్టించుకోకుండా బాధితురాలి పేరు, ఫోటో ప్రచురించడం చాలా తప్పే.

కానీ బాధితురాలు 5 ఏళ్ళుగా నరకం అనుభవిస్తోందని, ఆమె వచ్చి ఫిలిమ్ ఛాంబర్ పెద్దలకు ఫిర్యాదు చేసిందని ఇప్పుడు తాపీగా చెపుతున్నవారు ఇంతకాలం అతని పేరు ఎందుకు బయటపెట్టలేదు? పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటే అంతర్గత విచారణ జరుగుతోందని సర్ధిచెప్పుకోవడం సిగ్గుచేటు.




అసలు టాలీవుడ్‌ అంతర్గత విచారణ జరిపి ఏమి చేయగలదు? అంటే మహా అయితే నిందితుడిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించగలరు. అంతే కదా? కానీ ఈ వ్యవహారం తెలిసిన వెంటనే టాలీవుడ్‌ ప్రతినిధులే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండి ఉంటే వారి నిబద్దత పట్ల నమ్మకం కలిగి ఉండేది. కానీ వ్యవహారం బయటకు పొక్కిన తర్వాత నీతిసూత్రాలు వల్లెవేస్తే ఎవరూ నమ్మరు.