ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే హెచ్చరించారు.
కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో సహా కడప కంచుకోటలోనే ఏకగ్రీవాలు జరిగాయి. కనుక వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ చేయరా?అంటే ఈ రూల్ ఆయనకు వర్తించదు. ఎందుకంటే, ‘జగన్ 2.0’ అని చెప్తున్నారు కనుక!
ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు జరుగబోతున్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. వాటిని భారీగా పెంచింది కూడా. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
దాని ప్రకారం 5,000 లోపు జనాభా కలిగిన పంచాయతీలకు రూ.15 లక్షలు, 10,000 లోపు జనాభా కలిగిన పంచాయతీలకు రూ.25 లక్షలు, ఆ పైన జనాభా కలిగిన వాటికి రూ.50 లక్షలు నగదు బహుమతి అందిస్తుంది. ఇది వరకు ఏకగ్రీవాలకు రూ.5, 10, 20 లక్షలు నగదు బహుమతి ఇచ్చేది.
ఈ కారణంగా గ్రామ పంచాయతీలలో ‘సర్పంచ్’ పదవుల వేలం పాటలు కూడా జోరుగా సాగే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీ సర్పంచ్ పదవికి బుధవారం రాత్రి వేలంపాట జరిగింది. దీనిలో ముగ్గురు మహిళలు పోటీపడగా వారిలో ఒకరు రూ.1.20 కోట్లకు ‘సర్పంచ్’ పదవి దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీలలో ఈ విధంగా ‘సర్పంచ్’ పదవులకు వేలంపాటలు జరుగుతాయి.
గ్రామస్థాయిలో బలంగా ఉండే పార్టీలకు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు పెరుగుతాయి. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ పార్టీ అనుకూల అభ్యర్థులు కూడా ఈ వేలంపాటలో పాల్గొంటారా లేదా?
పాల్గొంటే వైసీపీ ద్వంద ప్రమాణాలని టీడీపి విమర్శిస్తుంది. పాల్గొనకపోతే గ్రామస్థాయిలో వైసీపీ పట్టు కోల్పోతుంది. పైగా లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఈ పదవులు దక్కించుకున్నా గ్రామాభివృద్ధి పనులకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల సహాయ సహకారాలు చాలా అవసరం. కనుక ఈ పంచాయతీ ఎన్నికలు వైసీపీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చెప్పవచ్చు.







