వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే అమరావతి విషయంగా పెద్ద తలపోటు వచ్చి పడింది. వచ్చి పడింది అనే కంటే ఆయన మంత్రులు ఏరికోరి తెచ్చిపెట్టారు. ఇప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. వారిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు జాలి ఉండడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గతంలో అమరావతి పై అటో మాట ఇటో మాట మాట్లాడిన ప్రతిపక్షపార్టీలు కూడా ఒకేతాటి పైకి రావడం ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచింది.
ఈరోజు రాష్ట్ర బీజేపీ నాయకులు రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్నారు. ఈ వారాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. టీడీపీ సహజంగానే రైతులకు మద్దతు తెలిపింది అయితే చంద్రబాబు ఇంకా రంగంలోకి దిగలేదు. దీనితో ఇప్పటివరకూ బీజేపీ వారి హడావిడే ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో సాక్షి ఈరోజు ఎల్లో బురద అంటూ ఒక పెద్ద వ్యాసాన్ని వండి వార్చింది. అయితే ఇందులో మొత్తంగా టీడీపీనే దూషించడం గమనార్హం. టీడీపీకి, బీజేపీకి పాము ముంగీస వైరం ఉన్నా టీడీపీనే ఆ పార్టీని నడిపిస్తుంది అన్నట్టు రాయడం గమనార్హం.
దీనికోసం ఇటీవలే టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా చంద్రబాబు చేయిస్తున్నారని ఆరోపిస్తుంది. పైగా రైతుల రూపంలో తమ పార్టీ వారితోనే టీడీపీ గొడవలు చేయిస్తుందని, ప్రతిపక్ష పార్టీల దగ్గరకు పంపుతుందని సాక్షి ఆరోపణ. అంటే టీడీపీ వారికి తప్ప అక్కడ భూములు ఇచ్చిన రైతులెవరికీ కౌలు ఇవ్వకపోయినా, రాజధాని తరలించుకుని పోయినా ఇబ్బంది లేదన్నమాట. అసలు ఇందులో వివాదమే లేదు అని వైఎస్సార్ కాంగ్రెస్ తనని తాను కన్విన్స్ చేసుకుని, తమ మద్దతుదారులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే నష్టం ఎవరికీ? ఇది ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడమే కదా?





