రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతోంది. గ్రామాల్లో ప్రతి రెండు వేల జనాభాకు, పట్టణాల్లో నాలుగు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి స్థానికంగా పాలనను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ ఈ నెల 2 నుండి ప్రారంభం అయ్యింది.
అయితే ఇప్పటికీ అనేక పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. సచివాలయ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయించారు. మొత్తం 150 మార్కులకు పరీక్షలు నిర్వహించగా ఓసీ కేటగిరికి 60, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 45 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు.
అయితే కొందరు అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపిక కావడం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు తగినంత మంది కటాఫ్ మార్కులను సాధించకపోవడంతో కొన్ని పోస్టులు భర్తీ కాలేదు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా ఎవరికి ఎక్కువ వస్తే వారిని తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అవసరమైన చోట్ల సున్నా మార్కులు వచ్చినా వారికి కొలువులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. ఐతే ఇదేమీ కొత్త ప్రక్రియ కాదని, గతంలోనూ ప్రభుత్వాలు తమ అవసరం మేరకు కట్ ఆఫ్ మార్కులను తగ్గించడం తొలగించడం చేశాయని ప్రభుత్వం అంటుంది.



