గతంలో ‘బ్రిటిష్ ఎయిర్ వేస్’ విమాన సర్వీసులపై ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ బ్లాస్ట్ అయిన ఉదంతం తెలిసిందే. బ్రిటిష్ ఎయిర్ వేస్ ‘డోంట్ కేర్’ లాంటి సమాధానాలు తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పడంతో అప్పట్లో సదరు ఎయిర్ వేస్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నాడు సచిన్ పీకిన క్లాస్ తో ఎయిర్ వేస్ దారికొచ్చినట్లుగా తాజాగా జరిగిన అనిల్ కుంబ్లే ఉదంతంలో తెలుస్తోంది.
వెస్టిండీస్ పర్యటన నిమిత్తం భారత జట్టుతో పాటు బయలుదేరిన కోచ్ అనిల్ కుంబ్లే విండీస్ లోని సెయింట్ కిట్స్ కు బయలుదేరగా, మధ్యలో గాత్విక్ ఎయిర్ పోర్టులో స్వల్ప విరామం కోసం ఆగిన వేళ, బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది కుంబ్లే లగేజ్ బ్యాగులను అక్కడే వదిలేశారు. దీంతో అనిల్ కుంబ్లే కిట్ బ్యాగ్, దుస్తులు తదితర వస్తువులన్నీ గాత్విక్ లో ఉండిపోగా, కుంబ్లే మాత్రం జట్టుతో కలిసి సెయింట్ కిట్స్ కు చేరుకున్నారు.
తదనంతరం తన లగేజీ కోసం ఫిర్యాదు చేయగా బ్రిటీష్ ఎయిర్ వేస్ స్పందిస్తూ… “జరిగిన తప్పుకు మన్నించండి… మీ బ్యాగ్స్ సెయింట్ కిట్స్ కు చేరలేదు, గాత్విక్ లో ఉండిపోయాయి. మీ సామాన్లు మీకు సాధ్యమైనంత త్వరగా అందిస్తాం” అంటూ ట్వీట్ చేసింది. మునుపటిలా ‘డోంట్ కేర్’ విధానాన్ని విడిచిపెట్టి, ప్రయాణికులకు సర్వీసులను అందించడంలో కాస్తంత మెరుగుపడింది అంటున్నారు పరిశీలకులు.



