విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో అంబానీ, అదానీ, టాటా, బిర్లా వంటి పారిశ్రామిక దిగ్గజాలు కనబడలేదని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎఫెక్టేనని సోషల్ మీడియాలో కొందరు అభివర్ణిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సదస్సులో రూ.3.3 లక్షల కోట్లు పెట్టుబడులు తగ్గాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పౌరులుగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే సంతోషించాలి. తగ్గితే బాధపడాలి. కానీ ఇలా పైశాచికానందం పొందడం ఏమిటో అర్థం కాదు. అంటే ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని కోరుకుంటున్నారా?
అయినా రాష్ట్ర గౌరవం, ప్రతిష్ఠకు సంబంధించిన రాజధాని అమరావతిపైనే అంత విషం చిమ్ముతున్నవారు, ఇలాంటి సదస్సులు, పెట్టుబడులపై విషం చిమ్మకుండా ఉంటారని ఎలా అనుకోగలం?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులు సాధించి వాటితో ఉద్యోగాలు కల్పించడం కంటే, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ ఓటు బ్యాంకు బలోపేతం చేసుకోవడం, టీడీపీని అడ్డు తొలగించుకుని ఎప్పటికీ వైసీపీయే అధికారంలో కొనసాగేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలతో కాలక్షేపం చేయడం వంటి పనులు ఇలాంటి వారికి తప్పుగా అనిపించదు. కానీ పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వంపై ఈవిధంగా నిరంతరం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు.
చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే వైసీపీ రాజకీయ విధానంగా మార్చుకున్నేంనందుకే, ఆ పార్టీ తప్పటడుగులు వేస్తూ తీవ్రంగా నష్టపోయిందని తెలిసి ఉన్నా, నేటికీ పై నుంచి కింద వరకు ఎవరూ మారాలనుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ దుష్ప్రచారమే ఇందుకు నిదర్శనం.
ఇలాంటి వారిని, వారి దురాభిప్రాయలను ఎవరూ మార్చలేరు. కానీ ఇలాంటి ఏపీ అభివృద్ధి వ్యతిరేకులు అవునన్నా కాదన్నా సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల కృషి, పట్టుదల, వారి ‘గుడ్ విల్’ వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న సభాముఖంగా చెప్పారు.
ఇందుకు చిన్న శాంపుల్‌గా నిన్నటి సదస్సులో జరిగిన కొన్ని ఒప్పందాలలో ఇదీ ఒకటి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. భారత్‌కు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ కంపెనీలు కలిసి ఈ పరిశ్రమను నెలకొల్పుతాయి.
కార్బన్ కాస్మో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 700 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా మరో 3,500 నుంచి 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.







