ఇతర పార్టీలతో పొత్తులు లేని పార్టీలలో కూడా ఎన్నికలలో టికెట్ల కోసం అనేక మంది పోటీ పడుతూ ఉంటారు. టికెట్లు దక్కనివారు అలకపాన్పు ఎక్కడమో లేదా వెంటనే వేరే పార్టీలో చేరి టికెట్ దక్కించుకోవడమో చేస్తుంటారు.
మరి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఈ సమస్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొదట ఆయా పార్టీలలో అంతర్గతంగా టికెట్లు ఆశిస్తున్నవారిని సంతృప్తి పరచాలి. అదే సమయంలో మిత్రపక్షాలను కూడా సంతృప్తి పరచాల్సి ఉంటుంది. కనుక సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతీసారి ఈ కత్తి మీద సాము చేయక తప్పడం లేదు.
కూటమితో పోలిస్తే వైసీపీకి ఈ సమస్య తీవ్రత చాలా తక్కువ. కనుకనే త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించగలిగింది.
సుమారు నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న గుండ లక్ష్మీదేవి, పార్టీపై అలిగి ఇంత కాలం తమ కుటుంబం దేనితో పోరాడిందో అదే వైసీపీలో చేరిపోయారు. అందుకు బహుమానంగా జగన్ ఆమెను శ్రీకాకుళం వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఖరారు చేశారు.
అయితే వైసీపీలో చేరి ఆమె ఈ ఛాన్స్ దక్కించుకున్నందున, ఈ పదవి కోసం ఆశపడిన స్థానిక వైసీపీ శ్రేణుల సహాయసహకారాలు పొందగలరా? అంటే అనుమానమే!
ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో కూటమి పార్టీలు ఘన విజయం సాధిస్తున్నప్పుడు, సొంత బలంతో గెలవగలరా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వెలువడితే తెలుస్తుంది.
ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ-జనసేనల మధ్య రచ్చ రచ్చ జరిగింది. ఈసారి భీమవరం మున్సిపల్ ఎన్నికల విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య సమస్య తలెత్తింది.
భీమవరంలో మొత్తం 52 వార్డులు ఉన్నాయి. వాటిలో టీడీపీకి 24, జనసేనకు 23, బీజేపీకి 5 సీట్లు తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.
అయితే, తాము అడిగిన 5 వార్డులలో మూడింటిని కేటాయించి, మిగిలిన రెండింటిని వేరే చోట ఇవ్వడంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా టీడీపీ, జనసేనలు సీట్లు ఖరారు చేసి ప్రకటించడాన్ని తమను అవమానించినట్లుగానే భావిస్తానని అన్నారు. కనుక భీమవరంలో 52 వార్డులలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఒకవేళ అలా చేస్తే, టీడీపీ, జనసేనల ఓట్లు చీలి వైసీపీ లబ్ధి పొందుతుంది. కనుక మళ్లీ బుజ్జగింపులు తప్పవు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలు సాధించి బలపడింది. కనుక ఈసారి శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా కనీసం 40-50 సీట్ల కోసం పట్టుబట్టవచ్చు.
కనుక ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమిలో సీట్ల విషయంలో రభస తప్పదని స్పష్టమవుతోంది. కానీ దీని వలన కూటమి ఐక్యత దెబ్బతినడమే కాకుండా, వాటి మధ్య చిచ్చు పెట్టేందుకు చేజేతులా వైసీపీకి మంచి అవకాశాలు అందిస్తున్నట్లవుతోంది.
ఈ ఎన్నికలు కూటమికి చాలా కీలకం. కనుక మూడు పార్టీలు ఇప్పటి నుంచే సీట్ల సర్దుబాటుపై కసరత్తు మొదలు పెట్టడం మంచిదేమో?





