
రాష్ట్ర విభజనతో ఒకసారి, ఐదేళ్ళ జగన్ పాలనతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనేది చేదు నిజం. కనుక ఇప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తుంటే, అమరావతి, పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుంటే ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. చివరికి విజయవాడలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 బైపాస్ రోడ్డు పనులు కూడా దాదాపు పూర్తి కావస్తున్నాయి.
ఆంధ్రాలో పుట్టినవారెవరైనా ఈ అభివృద్ధి చూసి చాలా సంతోషిస్తారు. కానీ జగన్, వైసీపీ నేతలు అసూయ పడుతున్నారు! తప్పులు వెతుకుతున్నారు! సిఎం చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో రగిలిపోతున్నారు! ఎందువల్ల?
తాను చేయలేకపోయిన అభివృద్ధిని ఆయన చేస్తున్నారనా.. లేదా ఈ అభివృద్దే 2029 ఎన్నికలలో వైసీపీ పాలిట శాపంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారా?
అభివృద్ధిని ఎన్నడూ రాజకీయాలతో ముడి పెట్టకూడదు. పెడితే అమరావతిలా పాడుబెట్టబడుతుంది. ‘లూలూ గ్రూప్’లా తరిమి వేయబడుతుంది.
కానీ ముడి పెట్టకపోతే ప్రభుత్వం మారినా ఇలా అభివృద్ధి పనులు వేగంగా సాగుతూనే ఉంటాయి. జగన్ హయంలో విశాఖ నగరంలో రహేజా గ్రూప్ ‘ఇనార్బిట్ మాల్’కి శంకుస్థాపన జరిగింది. అదిప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. ఎందుకంటే అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు కనుకనే!
ఇంతకీ విషయం ఏమిటంటే, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది.
ఈ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించగానే, మాజీ సిఎం జగన్ స్పందిస్తూ “ఒడిస్సాలో పెడుతున్న ప్లాంట్‌ని చూపించి ఏపీలో పెడుతున్నామని చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పారు. ఎంత డబ్బున్నా రెండు రాష్ట్రాలలో చెరో లక్షన్నర కోట్లు పెట్టుబడులు పెట్టగలరా ఎవరైనా?” అంటూ ఎద్దేవా చేశారు ఒకసారి.
మళ్ళీ అదే నోటితో “ఇదివరకు నేను దావోస్ వెళ్ళినప్పుడే ఆదిత్యదాస్ మిట్టల్‌తో మాట్లాడి ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించాను,” అని చెప్పుకుంటూ ఆయనతో దిగిన ఫోటోలు పెట్టుకున్నారు. ఆ ఫోటోలు చూపించి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫోటోలు, శిలాఫలకాలు చూపించి ఆ ప్రాజెక్టులు నేనే తెచ్చానని జగన్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదివరకు గూగుల్, భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా జగన్ ఇలాగే రకరకాలుగా మాట్లాడారు.
ప్రజలు ఓ గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఇలాగే చకచకా పనులన్నీ పూర్తి చేసి తనే ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు కదా? అప్పుడే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తీసుకువచ్చి ప్రారంభించేసి ఉంటే వాటి క్రెడిట్ అంతా ఆయనకే దక్కి ఉండేది కదా?
నేడు ఇలా క్రెడిట్ చోరీ అంటూ ఏడ్వాల్సిన అవసరం ఉండేది కాదు గదా? రాష్ట్రాన్ని అంతగా అభివృద్ధి చేసినందుకు ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆయననే ఎన్నుకుంటూ ఉండేవారు కదా?
కానీ అప్పుడు 5 ఏళ్ళపాటు సంక్షేమ పధకాల గోల, కక్ష సాధింపులు, వైసీపీ రంగులు, తన బొమ్మలతో కాలక్షేపం చేశారు. ఐదేళ్ళలో ఒకే ఒక్కసారి దావోస్ వెళ్ళారు. అక్కడి నుంచి తెచ్చింది.. వచ్చిందీ ఏమీ లేదు. కనుక మళ్ళీ ఎన్నడూ వెళ్ళలేదు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగూ పని చేయలేదు. ప్రజల ఆకాంక్షలు ఎలాగూ గుర్తించలేకపోయారు. అందుకు ప్రజలు వైసీపీని ఓడించి మూల కూర్చోబెట్టారు. అయినా ఇంకా తప్పు తెలుసుకోవడం లేదు. పశ్చాతాపపడటం లేదు. నేటికీ ప్రజల ఆకాంక్షలు గుర్తించలేకపోతున్నారు.
ఇలా అసూయతో మాట్లాడుతుంటే రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రజలు అనుకోకుండా ఉంటారా?
ఇలా వంకర మాటలు మాట్లాడుతుంటే ఎప్పటికైనా వైసీపీ మళ్ళీ అధికారంలో రాగలదా? అసలు అసూయ, విద్వేషం, రాజకీయ కక్షలే వైసీపీ విధానంగా మార్చుకున్నప్పుడు, అభివృద్ధి చేసి చూపిస్తున్న కూటమిని కాదని వైసీపీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించుకోవాలి. కానీ క్రెడిట్ చోరీ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఏపీ అభివృద్ధి విషయంలో జగన్, వైసీపీ నేతలు మాట్లాడే ప్రతీ తప్పుడు మాట వారి పార్టీ పాలిట శాపాలుగా మారుతాయని ఎప్పటికి గ్రహిస్తారో?
Veteran Telugu actress Pavala Shyamala is reportedly in critical condition following a medical emergency on…
There was once a time when Twitter was a primary medium to gauge the public…