
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పధకం పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పధకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.4,100 కోట్లు ఖర్చు చేస్తోందని, దానిలో ఒక్క క్యాన్సర్ చికిత్స కోసమే రూ.1,900 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యశ్రీ పధకం అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను ప్రతీ ఇంటికీ వాలంటీర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయాలని సూచించారు.
సరిగ్గా నెల రోజుల క్రిందటే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణ బాబుకి ఓ లేఖ వ్రాసింది. దానిలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉందని గుర్తు చేసింది.
ఆరోగ్యశ్రీ సేవలకు చార్జీలను కూడా పెంచాలని లేఖలో కోరింది. గత ఆరేడు నెలలలుగా వీటి కోసం ఎన్ని లేఖలు వ్రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, బిల్లు బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయవలసి వస్తుందని లేఖలో హెచ్చరించింది. ఆషా అధ్యక్షుడు డాక్టర్ వి. మురళీ కృష్ణ నవంబర్ 14వ తేదీన ఈ లేఖను ప్రభుత్వానికి పంపించారు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా వైద్య సేవల పరిమితిని రూ.10 నుంచి రూ.25 లక్షలకు పెంచేసి , ఇంటింటికీ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పుకోవడం చూస్తే మింగ మెతుకు లేదు…మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుంది. ఇది ఎన్నికల కోసమే అని వేరే చెప్పక్కరలేదు. కానీ ఆ కార్డులు పట్టుకొని ఏ ఆస్పత్రులకు వెళ్ళినా ఈ చికిత్సలు దీనికి వర్తించవనో లేదా ఈ కార్డుపై చికిత్స చేయలేమనో రోగులను తిప్పి పంపించేస్తుండటం పలువురికి అనుభవమే. అయినా ప్రభుత్వం ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోతే అవి రోగులకు ఉచితంగా చికిత్స చేస్తాయని ఎలా ఆశించగలము?
ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.10 నుంచి రూ.25 లక్షలకు పెంపు దేనికంటే అటు ఓట్ల కోసం, ఇటు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రుల నోళ్ళు మూయించేందుకే అని వేరే చెప్పక్కరలేదు.
రిటైర్ అయ్యే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సొమ్ము చెల్లించలేక వారి రిటైర్మెంట్ని 60 నుంచి 62 ఏళ్ళకు పెంచి తాత్కాలికంగా సమస్యను వాయిదా వేసుకొన్నట్లే, ఇదీను. పది లక్షలే చెల్లించలేకపోతున్న వైసీపి ప్రభుత్వం 25 లక్షలు ఎలా చెల్లించగలదు?అని ఆలోచిస్తే ఇంతకాలం ఈ పధకంతో భారీగా సంపాదించుకొన్న కార్పొరేట్ ఆస్పత్రులన్నీ ఇప్పుడు ఇదే పధకంతో దివాళా తీసినా ఆశ్చర్యం లేదు.
Vidya Balan's latest film Jailer 2 has released today on October 15, 2026. Amid all…
Over the last few years, South Indian cinema has witnessed a change, where Bollywood superstars…