మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే. చివరి నిముషంలో ఎలాంటి ట్విస్ట్ లు లేకపోతే, ఏప్రిల్ 14వ తేదీ నాడు అభిమానులను, సినీ ప్రేక్షకులను పలకరించవచ్చని తెలుస్తోంది. అయితే అప్పటివరకు ప్రిన్స్ అభిమానులు సందడి చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవలే వియత్నాం వెళ్లి, హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ ను చిత్రీకరణ జరుపుకుని చెన్నై చేరుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుతోంది. అయితే వియత్నాం నుండి చెన్నై చేరుకునే క్రమంలో క్లిక్ మనిపించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా ఉన్న ప్రిన్స్ పక్కనే దర్శకుడు మురుగదాస్ ఉండగా, ఆ వెనుక చిత్ర యూనిట్ సిబ్బంది కొలువుతీరి ఉన్నారు.
అసలే ఆకలితో ఉన్న మహేష్ అభిమానులకు ఈ కొత్త ఫోటో కాస్త ఆహారాన్నిచ్చినట్లయ్యింది. ఇలా ఆన్ లొకేషన్ షూటింగ్ పిక్స్ తోనే పండగ చేసుకుంటున్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు ‘ఫస్ట్ లుక్’ కోరిక ఎప్పుడు తీరుతుందో? మరో పక్కన మొన్న మొన్న షూటింగ్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ఫోటో శ్రీరామనవమి సందర్భంగా విడుదల అవుతుండడంతో, ప్రిన్స్ ఫ్యాన్స్ నిట్టూర్పు మొదలవుతోంది.



