ఇటీవల షూటింగ్ ప్రారంభమైన “మహర్షి” సినిమా అప్పుడే టీజర్ ముచ్చటను జరుపుకోవడంతో, ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన “అరవింద సమేత” టీజర్ సంగతులు చెప్పాలంటూ యంగ్ టైగర్ అభిమానులు చిత్ర యూనిట్ పై గత కొన్ని గంటలుగా ఒత్తిడి తెస్తున్నారు. ‘చిత్ర యూనిట్ కు కూడా టీజర్ రిలీజ్ చేయాలనే ఉంటుంది, అయితే దానికి సమయం, సందర్భం కావాలి కదా’ అంటూ ఓ పీఆర్ఓ కూడా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సూచించాడు.
[m9ad]
అయితే ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తోన్న సమయం వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15వ తేదీన “అరవింద సమేత వీరరాఘవ” మొదటి టీజర్ ను యూ ట్యూబ్ లోకి దించబోతున్నారు. ఈ వార్త తారక్ అభిమానుల్లో మాంచి ఉత్సాహాన్ని నింపుతోంది. ఆగష్టు 15వ తేదీన ఏ సమయంలో రిలీజ్ చేస్తారనే దానిపై స్పష్టత మరికొద్ది రోజుల్లో అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
దీంతో ‘ఇది కదరా మాకు కావాల్సిన ఎమోషన్’ అంటూ ‘రభస’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ స్టార్ హీరోలతో తొలిసారిగా చేసిన సినిమాలు ల్యాండ్ మార్క్ లా నిలిచిపోవడంతో, తమ కెరీర్ లో కూడా ‘అరవింద సమేత’ అలాంటి విజయాన్నే అందిపుచ్చుకుంటుందని అభిమానులు ఎంతో ఆశగా నిరీక్షిస్తున్నారు.



