
రాజకీయాలలో ఎట్టుకి పైఎత్తులు, వ్యూహాలు చాలా అవసరమే. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్, కేసీఆర్ వాటితోనే ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కొంటూ దెబ్బ తీసేవారు.
అయితే ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు తీర్చకుండా, రాష్ట్రాభివృద్ధి చేయకుండా ఎల్లప్పుడు వ్యూహాలు, ఎత్తులతో రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తే ఏమవుతుందో జగన్, కేసీఆర్‌లని చూస్తే అర్దమవుతుంది.
వారువురిలో కేసీఆర్ రాజకీయాలతో పాటు శరవేగంగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధి చేశారు. కానీ ఆయన అహంభావమే కొంప ముంచింది. జగన్ విషయంలో 5 ఏళ్ళపాటు చేసిన నీచ రాజకీయాలకు అహంభావంతో కూడా తోడవడంతో వైసీపి అధికారం కోల్పోయింది.
కేసీఆర్ వంటి మొనగాడిని ఓడించిన ఘనుడని, కేసీఆర్‌కి భిన్నంగా ప్రజలతో మమేకం అవుతూ పాలన సాగిస్తున్నారని రేవంత్ రెడ్డికి చాలా మంచి పేరువచ్చింది. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలుచేశారనే మంచిపేరు కూడా వచ్చింది.
అయితే మొదటిసారిగా హైడ్రాతో ఆయన ప్రతిష్ట మసకబారడం మొదలైంది. ఒకవేళ హైడ్రా సామాన్యులు, మద్య తరగతి ప్రజల ఇళ్ళ జోలికి పోకుండా బిఆర్ఎస్ నేతలు, ప్రముఖుల ఇళ్ళు, ఫామ్‌హౌస్‌లు కూల్చుకున్నా ప్రజలు అంతగా పట్టించుకునేవారు కాదేమో? కానీ వారి జోలికి వెళ్ళేసరికి తొలిసారిగా సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీనది ప్రక్షాళన ప్రయత్నంలో అక్కడ ఇళ్ళు కట్టుకొని నివశిస్తున్న నిరు పేదలు, మద్యతరగతి ప్రజల ఇళ్ళ జోలికి వెళ్ళారు.
రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించినప్పటికీ మూసీలో కట్టుకొన్న ఇళ్ళ విలువ అంతకు మించి ఉండటం, ఆ పరిసర ప్రాంతాలలోనే వారి జీవనోపాధి పొందుతుండటం, వారికి అండగా మజ్లీస్, బిఆర్ఎస్ పార్టీలు నిలబడటం వంటి అనేక కారాణాల వలన వారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటాలకు సిద్దం అయ్యారు.
ఒక అభివృద్ధిపనిలో ఇటువంటి అవరోధాలు అనివార్యమే. అయితే 10 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఏమై ఉండాలి?అని ఆలోచిస్తే సామాన్య ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చడం, పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించి ఉద్యోగాలు కల్పించడం, మౌలిక వసతులు కల్పించడం, వ్యవసాయానికి సాగునీరు, విద్యా, వైద్య, విద్యుత్ రంగాలు మొదలైన పెద్ద జాబితాయే ఉంది. అన్నిటికంటే ముందుగా గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా తలక్రిందులైన రాష్ట్ర ఆర్ధికస్థితిని చక్కబెట్టుకోవడం చాలా ముఖ్యం.
కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి సుమారు లక్ష కోట్లు ఖర్చు అయ్యే మూసీ ప్రక్షాళనని ఎంచుకుకోవడం విమర్శలకు తావిస్తోంది.
కానీ మూసీ ప్రక్షాళన విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహానికి బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రెండూ చిత్తయ్యాయని కొందరు మేధావులు వాదిస్తుండటం విడ్డూరంగా ఉంది. రేవంత్ రెడ్డి తన వ్యూహాలతో ప్రతిపక్షాలను చిత్తు చేసి ఉండవచ్చునేమో కానీ సామాన్య ప్రజలు ఆయనపై పెట్టుకొన్న ఆశలు వమ్ము చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.
తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్‌నే గద్దె దించేసిన ప్రజలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయకపోగా తమ ఇళ్ళు కూల్చివేస్తామంటే ఆదరించి మళ్ళీ ఓట్లు వేస్తారా? ఆలోచించుకుంటే మంచిది.
ప్రజలు ఆయనకు ఇచ్చిన 60 నెలల పుణ్యకాలంలో ఇప్పటికే 10 నెలలు కరిగిపోయాయి. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఆ పుణ్యకాలం ఇంకా తగ్గిపోతుంది. కనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు, రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తే మంచిది.
—
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…