దేశంలో ముస్లింలకు మాత్రమే అన్యాయం జరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
ముస్లింలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలన్నీ విఫలమయ్యాయని ఆరోపించారు. ముస్లింలను సమాన రాజకీయ భాగస్వాములుగా చూడకుండా కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ ముస్లింలకు రాజకీయంగా న్యాయం చేయలేకపోయాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఓవైసీ అన్నారు.
అంతేకాదు.. తమను తాము లౌకికవాద పార్టీలుగా చెప్పుకునే రాజకీయ శక్తులు కూడా ముస్లింలకు రాజకీయ సాధికారత కల్పించడంలో వెనుకంజ వేశాయని ఓవైసీ ఆరోపిస్తున్నారు. ముస్లింల సమస్యలపై మాట్లాడితే మెజారిటీ ఓట్లకు నష్టం జరుగుతుందనే ఆలోచనతో పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన గతంలోనూ విమర్శించారు.
అయితే దేశంలో ముస్లింలకు మాత్రమే అన్యాయం జరుగుతోందా? అని ఆలోచిస్తే నేటికీ దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని పేద కుటుంబాలు, మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులకు దూరంగా జీవిస్తున్న ప్రజల పరిస్థితి ఏమిటి? వారికి రాజకీయ ప్రాతినిధ్యం సంగతి దేవుడెరుగు. కనీసం విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి ప్రాధమిక అవసరాలు కూడా లేవు కదా?
అలాగే అగ్రవర్ణాల్లో పేదరికంలో ఉన్న కుటుంబాల సంగతేంటి? ఆర్థికంగా వెనుకబడిన వారికి సమాన అవకాశాలు లభిస్తున్నాయా? అంటే లేదనే చెప్పాలి.
అయితే కాంగ్రెస్, బిజేపిలను నిందిస్తున్న ఓవైసీలు ఏం చేస్తున్నారు?వారు మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారు కదా?వారు కూడా ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు కదా?
ముస్లింలకు తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను బెదిరిస్తూనే ఉన్నారు కదా?
బిజేపిని బూచిగా చూపిస్తూ ముస్లింల ఓట్లు దండుకుంటూనే ఉన్నారు కదా? ముస్లింల పేరుతో మత రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ లబ్ది పొందుతున్న మజ్లీస్ పార్టీ ప్పుడు, ఇతర పార్టీలను నిందించడం అవసరమా?







