మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య కేసు విచారణ పురోగతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని దాని సారాంశం. తర్వాత ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏం మాట్లాడుతారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. కనుక ఇప్పుడా చర్చ అనవసరం.
ఈ కేసులో నిందితులుగా ఉన్న దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించి వివేకా హత్యకు రూ.40 కోట్లు డీల్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. వారు చెప్పిన విషయాల ఆధారంగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు.
అయితే ఈ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని ఎంపీ అవినాష్ రెడ్డి చెపుతున్నారు. కనుక మళ్ళీ అదే చెప్పవచ్చు.
కానీ హత్య కేసులో నిందితుల అకౌంట్ల మద్య జరిగిన ఈ కోట్ల రూపాయల లావాదేవీలు ఎవరూ మార్చలేని సాక్ష్యాలు. కనుక వాటితో ఈడీ ఈ కేసులో పురోగతి సాధించగలిగితే, తర్వాత సీబీఐ మళ్ళీ రంగప్రవేశం చేసి ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులను అరెస్టులు చేసే అవకాశం ఉంటుంది.
అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలలో అదొక సంచలనమే అవుతుంది. కానీ అది జస్ట్ ఓ సంచలనం మాత్రమే. అంత మాత్రాన్న ఈ కేసు ముగిసిపోదు. వందో వెయ్యో అధ్యాయాలు కలిగిన ఈ కేసులో అక్కడి నుంచే మరో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. అంతే!







